అక్షరటుడే, వెబ్‌డెస్క్: Assembly sessions | అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రలతో సిద్ధం అయ్యాయి.
అసెంబ్లీ సమావేశాలు (Assembly sessions) ఎన్ని రోజులు నిర్వహిస్తామని ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. రేపు జరిగే బీఏసీ సమావేశంలో సభ నిర్వహణపై చర్చించనున్నారు. జనవరి మొదటి వారం వరకు సభ కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. అలాగే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి విపక్ష బీఆర్ఎస్ (BRS party) సైతం అస్త్రాలు తయారు చేసుకుంటుంది.
Assembly sessions | హాజరు కానున్న కేసీఆర్
అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ (KCR) హాజరు కానున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ సభకు హాజరు కావడం లేదు. నిబంధనల మేరకు అప్పుడప్పుడు ఒక్క రోజు మాత్రమే వచ్చారు. అయితే ఆయన అసెంబ్లీకి రాకపోవడంపై కాంగ్రెస్ అనేక విమర్శలు చేస్తోంది. దీంతో కేసీఆర్ సభకు హాజరు కానున్నారు. అయితే రేపు ఒక రోజు హాజరు అవుతారా.. సమావేశాల్లో మొత్తం పాల్గొంటారా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల ఆయన తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇప్పటి నుంచి ఓ లెక్క అన్నారు. దీంతో సమావేశాల్లో పాల్గొంటారని పలువురు భావిస్తున్నారు.
Assembly sessions | వాడీవేడిగా సాగనున్న సభ
అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగునున్నాయి. ఫోన్ ట్యాపింగ్, ఫార్ముల ఈ కారు రేస్ కేసు విషయాలను అధికార పార్టీ ప్రస్తావించే అవకాశం ఉంది. నీటి లెక్కలపై అధికార, ప్రతిపక్షం కసరత్తు చేస్తున్నాయి. కృష్ణా, గోదావరి జలాలు, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ లేవనెత్తనుంది. బీసీ రిజర్వేషన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై సైతం చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం ఇటీవల సొసైటీ పాలకవర్గాలను రద్దు చేసింది. సొసైటీలకు ఎన్నికల ద్వారా కాకుండా నామినేటెడ్ విధానంలో కార్యవర్గాలను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు సభలో చట్ట సవరణ చేసే అవకాశం ఉంది.