అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maganti Gopinath | దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు శాసనసభ శనివారం ఘనంగా నివాళులర్పించింది. ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలిపింది. అనారోగ్యంతో గోపినాథ్ ఆకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో శనివారం సమావేశమైన అసెంబ్లీ(Assembly)లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశ నుంచే గోపినాథ్ చురుకుగా ఉండేవారన్న రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)… 1983లో తెలుగుదేశం పార్టీలో గోపీనాథ్ తన రాజకీయ ప్రస్థానాన్ని గోపీనాథ్ ప్రారంభించారన్నారు. 1985 నుంచి 1992 వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేశారని, 1987-88 లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ డైరెక్టర్‌గా, 1988-93 లో జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడిగా పనిచేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌కు గొప్ప భక్తుడైన గోపీనాథ్ సినీ రంగంలోనూ గోపీనాథ్ నిర్మాతగా రాణించారని తెలిపారు. ‘పాతబస్తీ’(1995), ‘రవన్న’(2000), ‘భద్రాద్రి రాముడు’ (2004), ‘నా స్టైలే వేరు’ (2009) వంటి నాలుగు సినిమాలకు గోపీనాథ్ నిర్మాతగా వ్యవహరించారని తెలిపారు. రాజకీయంగా పార్టీలు వేరైనా.. గోపినాథ్ తనకు మంచి మిత్రుడని, ఆయన మరణం వారి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు .
Maganti Gopinath | మాగంటి మాస్ లీడర్
గోపీనాథ్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టాల్సి వస్తదని కలలో కూడా అనుకోలేదని కేటీఆర్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ అంటేనే సంపన్నులు నివసించే ప్రాంతమని పేరని, కానీ అక్కడ ఉండేది మొత్తం పేద ప్రజలని, బస్తీలతో ఉండే అలాంటి ఏరియాను మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) ఎంతో అభివృద్ధి చేశారని కేటీఆర్ కొనియాడారు. హైదరాబాద్(Hyderabad) హైదర్‌గూడలో పుట్టిన ఉస్మానియాలో డిగ్రీ చేసి, ఎన్టీఆర్‌కు వీరాభిమానికిగా టీడీపీలో అడుగుపెట్టారని తెలిపారు.
ఒక పార్టీని, నాయకుడిని నమ్ముకున్న గోపినాథ్.. ఎన్టీఆర్ నాయకత్వంలో.. కేసీఆర్ నాయకత్వంలో కష్టమొచ్చినా నష్టమొచ్చినా పని చేశారని, ఎమ్మెల్యేగా సేవలందించారని ప్రశంసించారు. బతుకమ్మ చీరలను ప్రారంభించే కంటే ముందు.. తన నియోజకవర్గంలో బతుకమ్మ పండుగకు చీర పెట్టే సంస్కృతి తీసుకొచ్చారని గుర్తు చేశారు.ఎస్పీఆర్ హిల్స్(SPR Hills)లో ఓ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే.. దాన్ని అడ్డుకుని పిల్లలకు గ్రౌండ్‌గా తీర్చిదిద్దారని తెలిపారు. బతికినంత కాలం మాస్ లీడర్‌గా డైనమిక్‌గా ఉన్నారని తెలిపారు.మాగంటి గోపినాథ్ చేసిన సేవలను బీజేపీ, మజ్లిస్, సీపీఐ ఎమ్మెల్యేలు గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతికలుగాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ మాగంటి సేవలను గుర్తు చేస్తూ, సంతాప తీర్మానం చదివి వినిపించారు.