అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Assembly Meeting | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుంది. కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghosh Commission) వేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ సుదీర్ఘంగా విచారణ చేపట్టి జులై 31న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికను ఇప్పటికే మంత్రివర్గంలో చర్చించారు. అసెంబ్లీలో చర్చకు పెడతామని గతంలోనే సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించారు. ఈ మేరకు తాజాగా ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Assembly Meeting | ఇరకాటంలో బీఆర్ఎస్
కాళేశ్వరం కమిషన్ నివేదికతో బీఆర్ఎస్ ఇరకాటంలో పడింది. కమిషన్ నివేదికపై కోర్టుకు వెళ్లిన కేసీఆర్, హరీశ్‌రావుకు అక్కడ చుక్కెదురైంది. అసెంబ్లీలో నివేదికపై(Assembly Report)చర్చించడానికి కోర్టు ఓకే చెప్పింది. నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి అంగీకరించలేదు. ఈ క్రమంలో అసెంబ్లీలో నివేదికను పెట్టి చర్చించడం ద్వారా బీఆర్ఎస్పై ఒత్తిడి తీసుకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం అక్రమాలకు కేసీఆర్ కారణమని పీసీ ఘోష్ కమిషన్(PC Ghosh Commission) నివేదిక లో పేర్కొన్నారు. దీంతో అసెంబ్లీలో చర్చ పెట్టి బీఆర్ఎస్ను కడిగేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
స్థానిక ఎన్నికల వేళ కాళేశ్వరం కమిషన్ అక్రమాలపై అసెంబ్లీలో చర్చిస్తే బీఆర్ఎస్(BRS)కు మైనస్ అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాళేశ్వరం నివేదిక ద్వారా బీఆర్ఎస్పై వ్యతిరేక వస్తుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు.
Assembly Meeting | 29న మంత్రివర్గ సమావేశం
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం(Cabinet Meeting) ఈ నెల 29న జరగనుంది. అనంతరం 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటిరోజు దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సంతాపం ప్రకటించనున్నారు. వైస్ స్పీకర్ ఎన్నిక, కాళేశ్వరం కమిషన్ నివేదికపై సమావేశాల్లో చర్చించనున్నారు.