అక్షరటుడే, వెబ్డెస్క్ : High Court | ఎంతో కాలంగా వేచి చూస్తున్న స్థానిక సంస్థల సమరానికి తెర లేచింది. నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఇక ఎన్నికల బరిలోకి దిగడమే తరువాయి అనుకున్న అభ్యర్థులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లు(BC Reservations) కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై స్టే విధించింది.
దీంతో స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరిన వారికి నిరాశే మిగిలింది. ఇప్పటికే గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతూ, ప్రజలతో మమేకమవుతూ స్థానిక పోరుకు సన్నద్ధమైన ఆశావాహులు.. కోర్టు(High Court) మధ్యంతర ఉత్తర్వులతో ఢీలా పడిపోయారు. మరో రెండు నెలల వరకు ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగే పరిస్థితి లేకపోవడంతో నిరాశలో కూరుకుపోయారు.
High Court | అన్ని ఏర్పాట్లు..
స్థానిక సంస్థల ఎన్నికలకు(Local Body Elections) ఇటీవల షెడ్యూల్ విడుదల కావడంతో ఆశావాహులు ఉత్సాహంగా రంగంలోకి దిగారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీగా పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఎంపీటీసీగా, సర్పంచ్ గా పోటీ చేయాలన్న ఆసక్తి ఉన్న వారు.. పల్లెల్లో ముఖ్యమైన వారిని, బలమైన నేపథ్యం ఉన్న వారిని మచ్చిక చేసుకున్నారు. కుల సంఘాల నేతలతోనూ మంథనాలు జరిపారు. మరోవైపు, గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవలి దసరా, బతుకమ్మ పండుగలకు వాడవాడలా ఫ్లెక్సీలు పెట్టించి హల్ చల్ చేశారు. మరోవైపు, ఎన్నికలకయ్యే వ్యయాన్ని భరించేందుకు ఆర్థికంగా కూడా సంసిద్ధమయ్యారు. సర్పంచ్ పదవిపై కన్నేసిన చాలా మంది లక్షలాది డబ్బును సిద్ధంగా ఉంచుకున్నారు. ఇప్పటికే పలుచోట్ల విందు సమావేశాలకు తెర లేపారు.
High Court | షాక్ ఇచ్చిన హైకోర్టు..
షెడ్యూల్ తో పాటు నోటిఫికేషన్ వెలువడడంతో ఆశావాహుల్లో ఎనలేని ఉత్సాహం నెలకొంది. ఇక నామినేషన్ వేయడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో హైకోర్టు అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బ్రేక్ వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై స్టే విధించింది. తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్(Election Notification) పైనా స్టే ఇచ్చినట్లయింది. అలాగే విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. పిటిషనర్లందరికీ కౌంటర్ దాఖలు చేయడానికి నాలుగు వారాలు, అనంతరం కౌంటర్ వేయడానికి మరో రెండు వారులు ప్రభుత్వానికి గడువు ఇస్తూ విచారణను వాయిదా వేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ తాత్కాలికంగా నిలిచిపోయింది.