అక్షరటుడే, ఇందూరు: Arya Vaishya Sangam | ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలని, సంఘ అభివృద్ధికి పాటుపడాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana) అన్నారు. నగరంలోని శ్రీరామ గార్డెన్లో ఆదివారం ఆర్యవైశ్య పట్టణ సంఘం (Arya Vaishya Sangam) అనుబంధ సంఘాల విజయోత్సవ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 1944న స్థాపించిన ఆర్యవైశ్య సంఘానికి ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఆర్యవైశ్యులు అంటే సమాజంలో సేవకులకు మారుపేరుగా ఉంటారన్నారు. సంపద సృష్టించడంలో ముందుంటూ.. 80 శాతం పన్నులను ప్రభుత్వాలకు చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో ముందున్న ఆర్యవైశ్యులు రాజకీయాల్లో వెనుకబడి పోతున్నారన్నారు.
ఆర్యవైశ్య పట్టణ సంఘం, అనుబంధ సంఘాల ఎన్నికల్లో ధర్మం గెలిచిందనడానికి ఎటువంటి సందేహం లేదన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఎన్నికల గురించి కొంతమంది ఎక్కువగా ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. ఓటమిని అంగీకరించడం కూడా విజయానికి తొలిమెట్టవుతుందని గుర్తు చేశారు. నూతనంగా గెలిచిన వారి బాధ్యత మరింత పెరిగిందని.. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కృషి చేయాలన్నారు.
Arya Vaishya Sangam | సంఘం అభివృద్ధికి నిధులు అందించా..
మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న పదేళ్లలో పట్టణ ఆర్యవైశ్య సంఘంతో పాటు గల్లీ సంఘాల అభివృద్ధికి నిధులు ఇచ్చి తోడ్పాటు అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా కూడా అంతకుమించి సంఘ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కొంతమంది సంఘ ఎన్నికల్లో ఒక వర్గానికి అనుకూలంగా ప్రోత్సహించినట్లు అపోహలు సృష్టించారన్నారు. తాను ఎప్పుడూ గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ముక్కా దేవేందర్ గుప్తా, ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షుడు ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల ప్రభాకర్, ఆయా అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.