అక్షరటుడే, వెబ్‌డెస్క్: Muthyala Sunil Reddy | కాంగ్రెస్ నేత ముత్యాల సునీల్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై ఆయనను డీజీజీఐ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ అంశం జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
సునీల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం పార్టీ నుంచి బాల్కొండ టికెట్ దక్కించుకుని స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. అప్పటి నుంచి బాల్కొండ నియోజకవర్గ వర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు.. గత కొన్నేళ్లుగా ఆరెంజ్ ట్రావెల్స్ సంస్థను నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో సునీల్ రెడ్డిని జీఎస్టీ ఎగవేత కేసులో డీజీజీఐ అధికారులు అరెస్ట్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది.
ప్రస్తుతం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్‌లో నలుగురు నేతల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతోంది. ముగ్గురు కార్పొరేషన్ ఛైర్లనకు తోడు సునీల్ రెడ్డి నేతలు ఎవరికి వారుగా తమ అనుచర గణాన్ని తిప్పుకోవడం శ్రేణుల్లో గందగోళాన్ని పెంచింది. అంతేకాకుండా ఈ నలుగురు నేతలు నియోజకవర్గంపై పట్టుకోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సునీల్ రెడ్డి అరెస్టు కావడం ఆయన అనుచరుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇదే అదునుగా ఆయన వ్యతిరేక వర్గ నేతలు సునీల్ అరెస్టు వ్యవహారాన్ని సోషల్ మీడియాలో పోటీపోటీగా ప్రచారం చేయడం మరింత హీట్ పెంచింది. కాగా.. ఆరెంజ్ ట్రావెల్స్‌కు సంబంధించి పన్ను ఎగవేత వ్యవహారం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ తెరపైకి వచ్చింది. దీనిపై తాజాగా డీజీజీఐ దూకుడు పెంచడం గమనార్హం.
Muthyala Sunil Reddy | రూ. 28 కోట్ల జీఎస్టీ ఎగవేశారనే ఆరోపణలతో..
జీఎస్టీ ఎగవేత కేసులో సునీల్ రెడ్డిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను రిమాండ్‌కు తరలించారు. ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీగా ఉన్న సునీల్ రెడ్డి రూ.28.24 కోట్ల జీఎస్టీని వినియోగదారుల నుంచి వసూలు చేశారు. అయితే దానిని ప్రభుత్వానికి చెల్లించలేదని అధికారులు పేర్కొన్నారు. జీఎస్టీ చట్టం 2017 ప్రకారం అరెస్ట్ చేశారు.
Muthyala Sunil Reddy | సునీల్‌రెడ్డి ఏమన్నారంటే..
జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముత్యాల సునీల్‌రెడ్డి స్పందించారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక ప్రటకన విడుదల చేశారు. ప్రజా జీవితంలో ఉన్న తాను ఆరెంజ్ ట్రావెల్స్ సంస్థపై జరుగుతున్న విచారణపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ట్రావెల్స్‌లో ప్రతి ఏటా యథావిధిగా నడుస్తున్న బస్సులపై 5శాతం జీఎస్టీ కడుతున్నట్లు తెలిపారు. కానీ జీఎస్టీ అధికారులు దానిని 12 శాతానికి పెంచి అదనంగా రూ.24 కోట్లు కట్టాలని సంస్థపై ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై విచారణ జరుపుతున్నారని తెలిపారు. ఎన్నో కష్టాలను అధిగమించి నిత్యం ప్రజా సేవలో ఉంటున్నట్లు పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.