అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections)కు నామినేషన్లు స్వీకరించే కేంద్రాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ఆదేశించారు. అభ్యర్థులకు సరఫరా చేయవలసిన ఫారాలు, ఓటర్ లిస్టు నామినేషన్ పత్రాలను సిద్ధం చేయాలని ఎంపీడీవోలు, సహయ జిల్లా ఎన్నికల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టర్ బుధవారం సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రిసెప్షన్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలలో నిర్దిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. సంబంధిత రూట్ల మ్యాపులను నిర్దిష్ట నమూనాలో ఆర్డీవో ఆమోదంతో పంపాలన్నారు. బ్యాలెట్ బాక్సులను జిల్లా నుంచి స్వీకరించుటకు రవాణా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి విధిగా పాటించాలన్నారు.
సర్పంచ్ పోటీదారుడు తహశీల్దారు వద్ద ఎంపీటీసీ, జడ్పీటీసీ పోటీదారుడు ఆర్డీవో వద్ద నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. ర్యాలీలు, సమావేశాలు, లౌడ్ స్పీకర్లు వినియోగానికి సంబంధిత పోలీస్ శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకొని తహశీల్దార్‌కు సమర్పించాలని ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో ర్యాంపు, నీరు, విద్యుత్, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల నిర్వహణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు.