అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bonalu Festival | ఆషాఢ మాసంలో హైదరాబాద్(Hyderabad)లో బోనాల సందడి నెలకొంటుంది. భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. మహానగరంలో జరిగే బోనాల పండుగకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బోనాల పండుగపై ఆమె మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Bonalu Festival | రూ.20 కోట్ల నిధుల కేటాయింపు
హైదరాబాద్‌లో బోనాల పండుగకు ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.20 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి సురేఖ తెలిపారు. ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు. ఆషాఢ మాసం(Ashadha Masam)లో హైదరాబాద్ నగరంలో మొత్తం 28 ఆలయాల్లో బోనాలు ఘనంగా నిర్వహించాలన్నారు.
Bonalu Festival | జూన్ 26 నుంచి ప్రారంభం
ఆషాఢ మాసం జూన్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు గోల్కోండ కోటలో బోనాలు(Golconda Kota Bonalu) సమర్పించుకోవడంతో తెలంగాణ బోనాలు మొదలు అవుతాయి. ఆషాఢ చివరి ఆదివారం వరకు ప్రతి రోజూ ఆలయాల్లో సందడి ఉంటుంది. గోల్కొండ బోనాలు నిర్వహించిన వారానికి ఉజ్జయిని మహాంకాళి (Ujjaini Mahaankali)అమ్మవారికి బోనం సమర్పిస్తారు. అనంతరం లాల్ దర్వజా, ధూల్‌పేట, బల్కంపేట, పాతబస్తీ, కొత్త బస్తీ అమ్మవారి ఆలయాల్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు. బోనాల సందర్భంగా రంగం, తొట్టెల ఊరేగింపు కార్యక్రమాలు చేపడతారు. కాగా.. బోనాల పండుగకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆదేశించారు.