అక్షర టుడే, ఇందూరు: Arrangements For Vote Counting | జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థ పరిధిలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) తెలిపారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో(Polytechnic College) శుక్రవారం ఏర్పాటుచేసిన శిక్షణా తరగతులను సందర్శించి పలు సూచనలు చేశారు.
Arrangements For Vote Counting | బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి..
కలెక్టర్ మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ భావోద్వేగాలతో ముడిపడి ఉన్నందున జాగ్రత్తతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల కమిషన్ (Election Commission) నిబంధనలను తప్పక పాటిస్తూ పూర్తి పారదర్శకంగా ఓట్ల లెక్కింపు జరపాలని సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్న ఉన్నతాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని చెప్పారు. లెక్కింపు అనంతరం ఫలితాల వెల్లడిలో గందరగోళానికి గురికాకూడదని, ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా పరిశీలించాలని వెల్లడించారు. కౌంటింగ్ హాల్లోకి ఆర్వో మినహా ఇతరులు ఎవరికి సెల్ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి..
నిజామాబాద్ నగరపాలక సంస్థకు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో, బోధన్ మున్సిపాలిటీ ఓట్లను విజయ మేరీ హై స్కూల్లో లెక్కింపు చేస్తారన్నారు. అలాగే ఆర్మూర్ మున్సిపల్(Armoor Municipality) ఓట్లను ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Armoor Government Degree College), భీంగల్ మున్సిపాలిటీకి సంబంధించిన కౌంటింగ్ ను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం స్ట్రాంగ్ రూముల నుంచి బ్యాలెట్ బాక్స్ లను కౌంటింగ్ హాల్‌కు చేరుస్తూ 8 గంటల నుంచి అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద వార్డు వివరాలను తెలిపేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశామని, ఎలాంటి పొరపాట్లు గందరగోళానికి తావు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు.
నాలుగు కౌంటింగ్ హాళ్లు..
నిజామాబాద్ కార్పొరేషన్లో అత్యధికంగా 60 డివిజన్లు ఉన్న నేపథ్యంలో నాలుగు కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశామని కలెక్టర్ చెప్పారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల(Postal ballot votes) లెక్కింపు జరుగుతుందని పేర్కొన్నారు. ఏకకాలంలో అన్ని డివిజన్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. బ్యాలెట్ బాక్సులను తెరిచి పోలైన ఓట్లను 25 చొప్పున బండిల్స్ గా విభజించి, ఒక్కో రౌండ్లో వేయి చొప్పున ఓట్లను లెక్కించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీలో కూడా ఇదే తరహాలో కౌంటింగ్ ఉంటుందన్నారు.
ఒక టేబుల్‌కు ఒక సూపర్వైజర్..
లెక్కింపు కోసం ఒక్కో టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌ను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. ఆయా మున్సిపాలిటీల పరిధిలో పోలైన ఓట్లను రౌండ్ల వారీగా లెక్కించేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం అదనపు సిబ్బందిని సైతం రిజర్వ్‌లో ఉంచామన్నారు. అభ్యర్థులు ఏజెంట్లు ఉదయం 7 గంటల లోపు కౌంటింగ్ సెంటర్ల వద్దకు రావాలని సూచించారు. తాము జారీ చేసిన ఎంట్రీ పాసులతో పాటు ఏదైనా గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని తెలిపారు. మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అనంతరం బోధన్‌లోని విజయ మేరీ పాఠశాల కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తదితరులు ఉన్నారు.
