అక్షర టుడే, బోధన్: Nizamabad Collector | జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణకు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ లక్ష్మి అన్నారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి (Collector T.Vinay Krishna Reddy), అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి బుధవారం ఎడపల్లిలోని (Yedapally Mandal) ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో వసతులను పరిశీలించారు.
రైతుల (Farmers) నుంచి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం, నిల్వల రికార్డులను తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటగా నిజామాబాద్ జిల్లాలో రైతులకు బిల్లుల చెల్లింపుల కోసం ట్యాబ్ ఎంట్రీలు చేస్తుండడంపై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని అభినందించారు. స్లాట్ బుకింగ్ (slot booking), ఎఫ్ఏక్యూ ప్రమాణాల గురించి రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అన్ని కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు, ధాన్యం ఆరబట్టే యంత్రాలు, మాయిశ్చర్ మీటర్లు, గ్రెయిన్ క్యాలిపర్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లాలో కొనుగోలు కేంద్రాల నిర్వహణపై స్పెషల్ ఆఫీసర్‌కు కలెక్టర్ వివరించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే, నిజామాబాద్ జిల్లాలో ముందస్తుగానే ధాన్యం దిగుబడులు వస్తాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని దిగుబడులు చేతికందే సమయానికి కొనుగోలు కేంద్రాలు (purchase centers) అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. గత సీజన్లో 606 కేంద్రాలు ఉండగా, ఈసారి 670 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 400 వరకు కేంద్రాలు ప్రారంభించినట్లు వివరించారు.
జిల్లాలో ఐకేపీ మహిళా సంఘాలకు (IKP womens groups) అధిక సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించామన్నారు. 17 శాతానికి లోబడి తేమ ఉన్న ధాన్యం తెచ్చిన వెంటనే తూకం జరిపించి, వెంటనే మిల్లులకు తరలిస్తున్నారని, ఎప్పటికప్పుడు ట్రక్ షీట్లు తెప్పించుకుని ట్యాబ్ ఎంట్రీలు చేయిస్తున్నామని తెలిపారు. కౌలు రైతులకు నేరుగా వారి ఖాతాల్లోనే బిల్లులు జమయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని వివరించారు. సాంకేతిక ఇబ్బందులున్నా.. మరింత వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వీరి వెంట డీఆర్డీవో సాయగౌడ్, డీఎస్వో అరవింద్ రెడ్డి, డీసీవో శ్రీనివాస్ రావు, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగవ్వ, స్థానిక అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు.