అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | గ్రామ పంచాయతీ ఎన్నికలకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు.
రూ.50వేల కంటే ఎక్కువ నగదు తీసుకు వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. రైతులు పంట అవసరాల నిమిత్తం తీసుకు వెళ్లాల్సి వస్తే తగిన రశీదును వెంట పెట్టుకోవాలని సూచించారు. ప్రధానంగా ఎన్నికలను పరిశీలించేందుకు ఇప్పటికే జిల్లాకు అధికారి వచ్చారని పేర్కొన్నారు. ఎన్నికలను వెబ్ కాస్టింగ్ ద్వారా నిత్యం పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. అవకాశం లేని చోట మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే 31 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు.
Nizamabad Collector | బలవంతంగా ఏక్రగీవం చేయొద్దు
ఏవైనా గ్రామాల్లో బలవంతంగా ఏకగ్రీవం చేయాలని చూస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఒకవేళ పోటీకి ఎవరూ లేకుండా ఒక్కరే నామినేషన్ వేస్తే తమ అనుమతితో ఏకగ్రీవం చేస్తామని కలెక్టర్ చెప్పారు. అలాగే ఎన్నికల కోడ్ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల రోజు వృద్ధులు, గర్భిణులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్ కుమార్ (Additional Collector Ankit Kumar), డీపీవో శ్రీనివాస్ రావు (DPO Srinivas Rao) పాల్గొన్నారు.
Nizamabad Collector | మీడియా సెంటర్ ప్రారంభం..
పంచాయతీ ఎన్నికలను (Panchayat elections) పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్లో గురువారం మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్‌ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు (print and electronic media) అందించాలని సూచించారు.
కేంద్రం ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, సకాలంలో ప్రచార ప్రకటనలకు సంబంధించిన అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను గమనిస్తూ ఉండాలని.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీపీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.