Srinagar Airport
Srinagar Airport | ఆర్మీ అధికారి వీరంగం.. స్పైస్ జెట్ సిబ్బందిపై దాడి

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Srinagar Airport | ఓ ఆర్మీ అధికారి (Army Officer) రెచ్చిపోయాడు. ఎయిర్​పోర్టులో స్పైస్​ జెట్​ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. శ్రీనగర్​ ఎయిర్​పోర్టులో జులై 26న ఈ దాడి జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో తాజాగా వైరల్​ అవుతున్నాయి.

ఓ సీనియర్​ ఆర్మీ అధికారి శ్రీనగర్​ నుంచి ఢిల్లీ (Srinagar-Delhi) వెళ్లడానికి టికెట్​ బుక్​ చేసుకున్నాడు. ఈ క్రమంలో విమానంలో అదనపు లగేజీని తీసుకు వెళ్లడానికి ఆయన యత్నించాడు. దీంతో స్పైస్​జెట్ (Spicejet)​ ఎయిర్​ లైన్స్​ సిబ్బందిని ఆయనను అడ్డుకున్నారు. లగేజీకి అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. వారి మాట వినని ఆర్మీ అధికారి తన లగేజీని విమానంలోకి తీసుకు వెళ్లడానికి యత్నించాడు. దీంతో సిబ్బంది అడ్డుకున్నారు.

Srinagar Airport | విచక్షణరహితంగా దాడి

తనను ఆపడంతో సదరు ఆర్మీ అధికారి రెచ్చిపోయాడు. నలుగురు సిబ్బందిపై విచక్షరహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో విమాన సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరికి వెన్నుముక విరిగింది. ఉచితంగా ఏడు కిలోల లగేజీ మాత్రమే తీసుకు వెళ్లే అవకాశం ఉందని విమాన సిబ్బంది తెలిపారు. అయితే ఆర్మీ అధికారి మాత్రం 14 కిలోల బరువున్న రెండు బ్యాగులు తీసుకు వెళ్లడానికి యత్నించాడని పేర్కొన్నారు. ఇది కుదరదు అన్నందుకు దాడి చేశారని తెలిపారు. సిబ్బంది దాడి ఘటనను స్పైస్​ జెట్​ తీవ్రంగా ఖండించింది.