అక్షరటుడే, ఆర్మూర్: ACB Trap | రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. సామాన్య ప్రజల నుంచి మొదలుపెడితే ఉద్యోగుల వరకు అందరిని లంచాల పేరిట వేధిస్తున్నారు. నిత్యం ఏసీబీ దాడులు (ACB raids) జరుగుతున్నా లంచాలకు మరిగిన అధికారులు కనీసం భయపడడం లేదు.
తాజాగా ఆర్మూర్ ఎంవీఐ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. వాహనానికి సంబంధించి చెక్‌లిస్ట్‌లో క్లియరెన్స్ కోసం ఎంవీఐ గుర్రం వివేకానంద రెడ్డి (MVI Gurram Vivekananda Reddy) ఓ వ్యక్తి నుంచి రూ.25 వేలు డిమాండ్ చేశారు.
దీంతో అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ (ACB DSP Shekhar Goud) ఆధ్వర్యంలో అధికారుల బృందం సదరు వ్యక్తి ఎంవీఐకి లంచం ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనిశాకు ఆర్మూర్ ఎంవీఐ పట్టుబడడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ACB Trap | ఇటీవల అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల్లోనూ తనిఖీలు
ఏసీబీ అధికారులు ఇటీవల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల్లోనూ తనిఖీలు నిర్వహించారు. సుమారు నెల రోజుల క్రితం కామారెడ్డి జిల్లా పొందుర్తి చెక్‌పోస్టులో సోదాలు చేశారు. ఈ సందర్భంగా నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే గత జూన్ నెలలో సలాబత్పూర్ రవాణా శాఖ చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ సమయంలో సుమారు రూ.90వేల నగదు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
ACB Trap | లంచం అడిగితే ఫిర్యాదు చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని తెలుపుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.