అక్షరటుడే, వెబ్‌డెస్క్: Armor MLA | ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి (MLA Paidi Rakesh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సీఎం, మాజీ సీఎం మధ్య ఏదో లాలూచీ నడుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.
ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్ (Assembly media point) వద్ద తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఎంతో కీలకమైన కాళేశ్వరంపై చర్చ సందర్భంగా రేవంత్‌రెడ్డి కేరళ పర్యటనకు వెళ్లడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) పంపించిన వ్యక్తితో రహస్య ఒప్పందం కుదుర్చుకోవడానికే కేరళకు వెళ్లారని ఆరోపించారు.
Armor MLA | సెటిల్‌మెంట్ కోసమే..
కీలకమైన కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న వేళ రేవంత్‌రెడ్డి కేరళ (Kerala) పర్యటనకు వెళ్లడం వెనక మతలబు ఏమిటని రాకేశ్‌రెడ్డి ప్రశ్నించారు. బుక్ రిలీజ్ కోసం రేవంత్‌రెడ్డి కేరళ వెళ్లారంటే నమ్మేలా లేదన్నారు. రేవంత్‌రెడ్డితో కేసీఆర్ తన మనిషిని కేరళకు పంపించారనే అనుమానం కలుగుతోందన్నారు. ఇద్దరు కలిసి కేరళకు వెళ్లారా..? అక్కడే కాళేశ్వరంపై సెటిల్‌మెంట్ జరుగుతుందా..? అని ప్రశ్నించారు.
తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మార్చనున్న కాళేశ్వరం (Kaleshwaram) చర్చ జరుగుతున్న వేళ ఈ సమయంలో అర్ధాతరంగా సీఎం కేరళ పర్యటన మతలబు ఏమిటని ప్రశ్నించారు. కాళేశ్వరం మీద చర్చ పెట్టి ఇంత అత్యవసరంగా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు కేరళ వెళ్లినట్లు అని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ముందస్తు ఒప్పందం కోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ (KC Venugopal) రేవంత్‌రెడ్డిని కేరళకు పిలిచినట్లు ఉన్నాడని ఆరోపించారు.
Armor MLA | అక్రమార్కులకు గుణపాఠం కావాలి..
భవిష్యత్ తరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) కుంభకోణం గుణపాఠం కావాలని తెలిపారు. అప్పట్లో స్వాతంత్య్ర సమరయోధుల కోసం అండమాన్ జైల్ కట్టారని.. ఇప్పటికీ దాని గుర్తులు, ఆనవాళ్లు ఉన్నాయన్న రాకేశ్‌రెడ్డి.. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిన వారికోసం ప్రత్యేక జైలు కట్టించి అందులో నిర్బంధించాలని డిమాండ్ చేశారు. అప్పుడే రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్న భావన కలుగుతుందన్నారు.
ఆ జైల్ చూసినప్పుడల్లా అవినీతి రాజకీయ నాయకుల గుండెల్లో భయం పుట్టాలన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) రాముడి లాంటి వారని రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే ఆయనకు ఈ కష్టాలు తప్పడం లేదన్నారు. రాముడంతడి వాడికి వనవాసం తప్పలేదన్న ఆయన.. రేపు తమకు కూడా ఈ పరిస్థితి ఎదురు కావచ్చని.. అయినా తాము ధర్మం కోసం కొట్లాడుతామని చెప్పారు.