అక్షరటుడే, ఆర్మూర్ : Municipal Election Arrangements | మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలింగ్, కౌంటింగ్‌కు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఆమె సోమవారం సందర్శించారు.
Municipal Election Arrangements | డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో..
డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి, తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పక్కాగా అందించాలని, చెక్‌లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి అందినదా, లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు. సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు (Polling Centers) సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు.
Municipal Election Arrangements | బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో..
పోలింగ్ సామాగ్రి, ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తేవాలని సూచించారు. స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ హాళ్లను సైతం పరిశీలించిన కలెక్టర్, సీసీటీవీలు ఏర్పాటు చేయాలని, ఒక్క సెకను కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. సకాలంలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయాలని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగులకు ర్యాంప్‌లు, వీల్ చైర్లు అందుబాటులో ఉండాలన్నారు. బీఎల్వోలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటరు సమాచార వివరాలతో కూడిన స్లిప్పులను వంద శాతం పంపిణీ చేసేలా పర్యవేక్షణ చేయాలన్నారు.
Municipal Election Arrangements | మామిడిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో..
మామిడిపల్లిలోని (Mamidi Palli) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సదుపాయాల కల్పన విషయమై అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు అందుబాటులో ఉండాలని, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలన్నారు. అనవసర తప్పిదాలకు తావిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎంతో అప్రమత్తతో ఎన్నికల విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలోని మూడో తరగతి గదిని కలెక్టర్ సందర్శించి, విద్యార్థులకు ఆంగ్లం సబ్జెక్టుపై కొద్దిసేపు బోధించారు. పలు ప్రశ్నలు అడిగి విద్యార్థులు సామర్థ్యాన్ని అంచనా వేశారు. తనవెంట తెచ్చిన చాక్లెట్లను కలెక్టర్ స్వయంగా చిన్నారులకు పంచిపెట్టారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా (Sub Collector Abhigyan Malviya), ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, స్థానిక అధికారులు ఉన్నారు.