అక్షరటుడే, ఆర్మూర్ : Armoor Constituency | అవినీతి కాంగ్రెస్ కమీషన్ల పడగ నీడలో ఆర్మూర్ నియోజకవర్గం విలవిల్లాడుతోందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) విమర్శించారు.
ఆర్మూర్‌లోని తన నివాసంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి (పీవీఆర్) అక్రమ వసూళ్లకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని ఆరోపించారు. ఆయన దోపిడీ దొంగల ముఠా లీడర్‌గా మారి.. ప్రజల సొమ్ము కాజేస్తున్నాడని మండిపడ్డారు.
Armoor Constituency | పైసా వసూల్ రెడ్డి పీవీఆర్
ఆర్మూర్ ప్రజల దృష్టిలో పీవీఆర్ అంటే పైసా వసూల్ రెడ్డి అని జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బినామీల ద్వారా అక్రమ వసూళ్ల సునామీ సృష్టిస్తున్న పీవీఆర్ యథేచ్చగా ల్యాండ్, శాండ్ మాఫియాల ఆగడాలకు పాల్పడుతున్నారన్నారు. కల్లు బట్టీ నుంచి నల్లమట్టి దాకా మామూళ్ల వసూళ్లు చేస్తున్నారని, చివరకు టిఫిన్ సెంటర్ల నుంచి చికెన్ షాపులను వదలకుండా లూటీల పర్వం సాగిస్తున్నారని జీవన్‌రెడ్డి ఆరోపించారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో గాలి పీల్చినా వినయ్ రెడ్డికి (Vinay Reddy) కప్పం కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పీవీఆర్ అవినీతి దాహానికి అన్ని వర్గాల వారూ బలవుతున్నారని విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్నా డబ్బుల కోసం డిమాండ్లు వస్తున్నాయని, వినయ్ రెడ్డి మాటకాదంటే అక్రమ కేసుల్లో రిమాండ్లు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
జిల్లాకు చెందిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిల అండతో తనకు అనుకూలంగా పనిచేసే అధికారులను తెచ్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఆ అధికారులు నోటీసులు ఇవ్వడం, వినయ్ కుమార్ రెడ్డి వసూలు చేసుకోవడం పరిపాటైందన్నారు. పీవీఆర్ కోసం అక్రమ వసూళ్లకు తెగబడి ఏసీబీ వలలో చిక్కిన రాజ్‌కుమార్ రియల్ ఎస్టేట్, ఆస్పత్రులు, పేద, ధనిక అనే తేడా లేకుండా డబ్బులు దండుకొని కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పీవీఆర్‌తో (PVR) కలిసి వాటాలు పంచుకున్నారన్నారు.
Armoor Constituency | బెదిరింపుల చిట్టా ఇదే..
ఆర్మూర్ పట్టణంలోని ఆనంద్ హాస్పిటల్‌ను బెదిరించి రూ.50 లక్షలు, ఆధ్య హాస్పిటల్‌ను బెదిరించి రూ. 20లక్షలు, గౌతమీ హాస్పిటల్‌ను బెదిరించి రూ.20లక్షలు వసూలు చేసిన కమిషనర్ మామిడిపల్లి హనుమాన్ టెంపుల్ దగ్గర బోర్‌వెల్స్ భోజారెడ్డి, రవిగౌడ్ వెంచర్ ప్రతినిధులను సైతం బెదిరించారని జీవన్ రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలోని 18 ఫంక్షన్ హాళ్లను బెదిరించారని, మామిడిపల్లిలోని నరసింహారెడ్డి వెంచర్‌ను బెదిరించారని, తీగల నర్సారెడ్డి అపార్ట్‌మెంట్‌ను బెదిరించి అక్రమ వసూళ్ల దందా సాగించారని ఆయన మండిపడ్డారు.
Armoor Constituency | రూ. 9 కోట్లు వసూలు చేశారు..
ఆర్మూర్‌లో 470 కొత్త ఇళ్ల నెంబర్లు ఇవ్వడానికి రూ. 9 కోట్లు వసూలు చేశారని, మామిడిపల్లి రైల్వే వంతెన (Mamidipalli Railway Bridge) నుంచి పెర్కిట్ వరకు 450 ఇళ్లు, షాపులకు నోటీసులు ఇచ్చి డబ్బులు డిమాండ్ చేశారన్నారు. నందిపేట్, డొంకేశ్వర్, మాక్లూర్, ఆలూరు మండలాల్లో పోలీసుల అవినీతికి అడ్డేలేదన్నారు. సీఐ కల్లు బట్టీలను బెదిరించి డబ్బులు దండుకుంటున్నారని విమర్శించారు. చికెన్ షాపుల నుంచి తనకు, కాంగ్రెస్ ఇన్‌ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి ఇంటికి ప్రతిరోజూ అవసరమైన చికెన్ ఉచితంగా పంపాలని హుకూం జారీ చేశారని జీవన్ రెడ్డి విమర్శించారు.
పంత్ రోడ్డులో తరతరాలుగా ఉన్న షాపులకు నోటీసులు ఇచ్చి లంచాలు డిమాండ్ చేశారని, గోదాములు నిర్మిస్తున్న వారు కూడా పీవీఆర్ ధనదాహానికి బాధితులేనని ఆయన వ్యాఖ్యానించారు. కమిషనర్, అక్రమ వసూళ్లలో కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పీవీఆర్‌కు భారీగా వాటాలు పంచి పెట్టాడన్నారు. వినయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ కార్యాలయాల్లో కెమెరాలు ఏర్పాటు చేసి మరీ అవినీతికి పాల్పడుతున్నారంటూ విమర్శలు చేశారు. పీవీఆర్ ఒత్తిళ్లకు లొంగి అవినీతికి కొమ్ముకాసిన ఒక ఎంవీఐ, పలువురు రెవెన్యూ అధికారులు, తాజాగా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజ్ కుమార్ ఏసీబీ వలలో చిక్కి జైళ్ల పాలయ్యారని జీవన్ రెడ్డి అన్నారు. ఒక్క మున్సిపల్ కమిషనరే రూ.20 కోట్ల ఆస్తి అవినీతి ద్వారా కూడబెట్టుకున్నారంటే, ఇక కాంగ్రెస్ ఇన్‌ఛార్జులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం, ఆయన సోదరులు రూ. ఎన్ని వేల కోట్లు దోచుకుంటున్నారో అర్థం చేసుకోవాలన్నారు.
పీవీఆర్ అవినీతిపై జిల్లాకే చెందిన పీసీసీ చీఫ్ (PCC Chief) ఎందుకు నోరు మెదపడం లేదని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక తానే నేరుగా రంగంలోకి దిగి అవినీతిపరుల భరతం పడతానని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ దోపిడీకి గురవుతున్న బాధితుల పక్షాన పోరాడుతానని, ఇక నుంచి ఆర్మూర్ లోని తన ఇల్లే అవినీతి అనకొండలకు రిపేర్ చేసే జనతా గ్యారేజ్ అని, అవినీతికి బలవుతున్న బాధితులు ఎప్పుడైనా తన ఇంటి తలుపులు తట్టవచ్చని చెప్పారు. అవసరమైతే కేటీఆర్ (KTR), హరీష్‌రావు (Harish Rao)లను ఆర్మూర్‌కు రప్పించి అవినీతి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పీవీఆర్ ఇంటిని అమ్మివేయించి బాధితులకు ఇస్తామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అడ్డుకునే బాధ్యత కలెక్టర్‌దేనని, పోలీసు అధికారుల అవినీతికి సీపీదే బాధ్యత అని ఆయన అన్నారు.
అవినీతికి కళ్లెం వేయకుంటే కలెక్టరేట్, మున్సిపల్, తహశీల్దార్ ఆఫీసులను ముట్టడిస్తామన్నారు. పదివేల మంది ప్రజలతో కలిసి ఆందోళనలు చేస్తామని జీవన్ రెడ్డి హెచ్చరించారు. సమావేశంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్, మాజీ జడ్పీటీసీ మెట్టు సంతోష్, మాజీ కౌన్సిలర్లు చక్రు, అల్జాపూర్ మహేందర్, సీనియర్ నాయకులు రాజేశ్వర్ రెడ్డి, పోల సుధాకర్, నచ్చు చిన్నారెడ్డి, జీజీ రామ్, పృథ్వీ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.