అక్షరటుడే, వెబ్‌డెస్క్: Warts | పులిపిర్లు అనేవి చాలా మందిని వేధించే ఒక సాధారణ చర్మ సమస్య. ఇవి ప్రమాదకరమైనవి కానప్పటికీ, మెడ, చంకలు లేదా ఇతర సున్నితమైన భాగాలపై ఉన్నప్పుడు ఆభరణాలు లేదా దుస్తులు తగిలి నొప్పి, దురద, మంట వంటి ఇబ్బందులను కలిగిస్తాయి. పులిపిర్లకు కారణాలు ఏమిటో.. వాటిని సులభంగా, సహజమైన పద్ధతిలో ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం.
Warts | ఎందుకు వస్తాయి?
పులిపిర్లు ఏర్పడటానికి కచ్చితమైన కారణాన్ని వైద్యులు ఇంకా పూర్తిగా నిర్ధారించనప్పటికీ, చర్మం కింద ఉండే భాగంలో కొల్లాజెన్ ,ఫైబర్ పేరుకుపోవడం వల్ల ఇవి ఏర్పడతాయని భావిస్తున్నారు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
- అధిక బరువు, డయాబెటిస్, ఇన్సులిన్ నిరోధకత , థైరాయిడ్ , హార్మోన్ల సమస్యలు ఉన్నవారిలో కనిపిస్తాయి.
- సాధారణంగా మెడకు ఒక వైపు లేదా రెండు వైపులా, చంకలు, కనురెప్పలు , మోచేతులపై కూడా ఏర్పడతాయి.
తొలగించే అద్భుతమైన ఇంటి చిట్కాలు:
టీ ట్రీ ఆయిల్: టీ ట్రీ ఆయిల్లో యాంటీ ఫంగల్ , యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పులిపిరి ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేసి, టీ ట్రీ ఆయిల్‌తో సున్నితంగా మసాజ్ చేయండి. దానిపై కాటన్ బ్యాండేజ్ వేసి రాత్రంతా ఉంచి, మరుసటి రోజు ఉదయం కడగాలి. ఇలా కొద్ది రోజులు చేస్తే వాటంతట అవే రాలిపోతాయి.
యాపిల్ సైడర్ వెనిగర్(ACV ): యాపిల్ సైడర్ వెనిగర్ యాసిడ్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఒక కాటన్ బాల్‌ను ACVలో ముంచి, దాన్ని పులిపిరిపై ఉంచి కట్టు కట్టుకోవాలి. రోజుకు 3 నుంచి 4 సార్లు ఇలా చేయడం వల్ల సులభంగా తొలగిపోతాయి.
అరటి పండు తొక్క: అరటి పండు తొక్కలోపలి భాగంలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. అరటి పండు తొక్క లోపలి భాగాన్ని పులిపిరిపై వేసి, దానిపై పట్టీ లేదా బ్యాండేజ్ వేసి రాత్రంతా ఉంచండి. ఇలా వారం రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే రాలిపోతాయి.
అల్లం ,వెల్లుల్లి పేస్ట్: అల్లం ,వెల్లుల్లి రెండింటిలోనూ పులిపిర్లను తొలగించే గుణాలు ఉన్నాయి. రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను దంచి పేస్ట్‌లా చేసి, ఆ మిశ్రమాన్ని పులిపిరిపై పెట్టి రాత్రి పూట బ్యాండేజ్ వేయాలి. మరుసటి రోజు ఉదయం కడగాలి. అల్లం పేస్ట్‌ను కూడా ఇదే విధంగా ఉపయోగించి మంచి ఫలితం పొందవచ్చు.
విటమిన్ ఇ ఆయిల్: విటమిన్ ఇ ఆయిల్ కూడా వీటిని తొలగించడంలో సహాయపడుతుంది. మార్కెట్లో లభించే విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను తెరిచి, దానిలోని ద్రవాన్ని పులిపిరిపై రాయాలి. రోజూ ఇలా చేస్తుంటే కొద్ది రోజుల్లో సమస్య తగ్గుతుంది.
ముఖ్య గమనిక: కళ్లపై లేదా కనురెప్పల పక్కన పులిపిర్లు ఉంటే, పైన పేర్కొన్న ఇంటి చిట్కాలను పాటించకూడదు. అటువంటి సున్నితమైన భాగాలపై చికిత్స కోసం తప్పకుండా చర్మ వైద్య నిపుణుడిని (Dermatologist) సంప్రదించాలి.