అక్షరటుడే, న్యూఢిల్లీ: Aravalli mountains protests | ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మడత పర్వత వ్యవస్థలలో అరావళి పర్వత శ్రేణి ఒకటి. గుజరాత్ నుంచి రాజస్థాన్, హరియాణా మీదుగా ఢిల్లీ వరకు దాదాపు 700 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. హిమాలయాల కంటే పురాతనమైన ఈ పర్వతాలు లక్షలాది సంవత్సరాలుగా భారత ఉపఖండ భౌగోళిక వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.
అరావళి పర్వతాలు కేవలం రాళ్ల సముదాయమే కాదు. ఎడారుల విస్తరణను అడ్డుకునే సహజ సిద్ధమైన గోడగా ఉంటున్నాయి. ఇంకా వర్షపు నీటిని భూగర్భంలోకి చేర్చే వ్యవస్థగానూ పనిచేస్తున్నాయి. స్థానిక వాతావరణ పరిస్థితులను కాపాడే సహజ రక్షణ కవచంగానూ ఉంటున్నాయి.
Aravalli mountains protests |ఆరావళి ప్రాధాన్యం..
పర్యావరణం పరంగా తీసుకుంటే ఆరావళి పర్వతాల ప్రాధాన్యం అపారం.
భూగర్భ జలాల వృద్ధి: వర్షపు నీటిని భూమిలోకి పంపడం ద్వారా భూగర్భ జలాలను వృద్ధి చేస్తున్నాయి. తద్వారా లక్షలాది మంది అవసరాలను తీర్చుతున్నాయి.
ఎడారి విస్తరించకుండా..: రాజస్థాన్, హరియాణా వైపు థార్ ఎడారి విస్తరించకుండా అరావళి పర్వతాలు అడ్డుకుంటున్నాయి.
వాతావరణం: ఎన్సీఆర్, ఢిల్లీ ప్రాంతాల్లో దుమ్ము తుఫాన్లు రాకుండా.. కాలుష్యం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
జైవ వైవిధ్యం: ఎంతో అరుదైన జంతుజాలం, వృక్షజాలం, అతి ముఖ్యమైన వన్యప్రాణుల కారిడార్లకు నిలయంగా ఉన్నాయి.
నీటి వనరులు: ఎన్నో నదులు వీటిల్లో పుట్టి.. జీవనాధారానికి, వ్యవసాయానికి తోడ్పడుతున్నాయి.
ఈ క్రమంలోనే పర్యావరణవేత్తలు ఆరావళి పర్వతాలను భారతావనికి అవసరమైన పర్యావరణ మౌలిక సదుపాయాల వ్యవస్థగా వర్ణిస్తున్నారు. ఇక్కడ మైనింగ్ mining చేయడానికి సరేమిరా ఒప్పుకోవడం లేదు.
Aravalli mountains protests | సుప్రీంకోర్టు జోక్యం..
సుప్రీంకోర్టు Supreme Court కేంద్ర ప్రభుత్వ మద్దతుతో 2025 నవంబరులో వివరణ ఇచ్చింది. చుట్టుపక్కల భూమి కంటే కనీసం 100 మీటర్ల ఎత్తు ఉన్న ప్రాంతమే అరావళి పర్వతం పర్వతాలుగా పేర్కొంది. ఇలాంటి రెండు కొండలు 500 మీటర్ల దూరంలోపు ఉంటే వాటిని ఆరావళి శ్రేణిగా పరిగణిస్తామంది. కానీ, ఇక్కడి చాలా పర్వతాలు 100 మీటర్ల లోపే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పుతో అరావళి పర్వతాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.
తీవ్ర విమర్శలు
సుప్రీం తీర్పును పర్యావరణవేత్తలు, సామాజిక వేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనివల్ల చాలా తక్కువ ఎత్తు ఉన్న కొండలు, పర్వత పాదభాగాలు తమ ఉనికి కోల్పోతాయని వాదించారు. అవే వన్యప్రాణులు, భూగర్భ జలాలకు అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు మళ్లీ వెనక్కి
పెరుగుతున్న నిరసనలు, న్యాయపోరాటాల నేపథ్యంలో సుప్రీంకోర్టు వెనక్కి తగ్గింది. డిసెంబర్ 29, 2025 న తన ముందటి తీర్పును నిలిపివేసింది. నిపుణుల కమిటీని నియమించి, దీనిపై సమగ్రంగా విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తుది తీర్పు వెలువడే వరకు కొత్త మైనింగ్ లీజీలపై ఆంక్షలు కొనసాగుతాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కాగా, చట్టబద్ధంగా ఉన్న మైనింగ్ కార్యకలాపాలు పర్యావరణ నిబంధనలతో ఇప్పటికే కొనసాగుతున్నాయి.
ఖనిజ సంపద ఏముందంటే..
అరావళి ప్రాంతంలో లైమ్‌స్టోన్, మార్బుల్, డెకరేటివ్ రాళ్లు, కంకర, ఇసుక వంటి ఖనిజ సంపద పుష్కలంగా ఉంది. ఇవే మైనింగ్‌కు ఊతంగా మారాయి. స్థానిక మైనింగ్‌ను లాభసాటిగా మారుస్తున్నాయి. కానీ, దీనివల్ల భూగర్భ జలాలు, స్థానిక జీవనాధారాలు, అడవులు నాశనం అవుతున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర
90 శాతం అరావళి పర్వతాలు ఇంకా రక్షణలోనే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్వచనాన్ని ప్రతిపాదిస్తూ వాదిస్తోంది. కానీ రాజస్థాన్‌లో ప్రజా నిరసనలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. పర్యావరణవేత్తలు ఇంకా ఉద్యమిస్తూనే ఉన్నారు. అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రజలు ఎందుకు రోడ్డెక్కారంటే..
అరావళి పర్వతాలు తమ జీవనాధారమని, వారసత్వమని స్థానిక ప్రజలు భావిస్తున్నారు. అందుకే ఈ పర్వతాలను ఏకలాజికల్ సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్నారు. వీరికి పర్యావరణవేత్తలు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ ఒత్తిడి వల్లే సుప్రీంకోర్టు వెనక్కి తగ్గి, తన తీర్పును పునఃపరిశీలిస్తోంది.
చేయి అందించమంటున్న పర్యావరణవేత్తలు..
అరావళి పర్వతాలు ఒక్క రాజస్థాన్‌కే కాదు.. మొత్తం భారతావనికే తలమానికం. చిన్నప్పుడు ప్రతి ఒక్కరు పాఠశాలల్లో అరావళి పర్వత శ్రేణి గురించి చదివే ఉంటారు. ఇప్పటి విద్యార్థులు కూడా చదువుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా ఈ సహజ సంపద గురించి చదువుకోవాలంటే.. స్థానిక ప్రాంతానికి రక్షణ కవచం కావాలంటే, థార్ ఎడారి విస్తరించకుండా ఉండాలంటే అరావళి పర్వతాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో స్థానిక పర్యావరణవేత్తలు దేశంలోని సామాజికవేత్తల మద్దతు కోరుతున్నారు. తమకు అండగా నిలబడి ఉద్యమించాలని పిలుపునిస్తున్నారు.