అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BC Reservations | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభ, మండలి ఆమోదించిన బిల్లులను ఆమోదించాలని అఖిల పక్షాలు గవర్నర్ కు విజ్ఞప్తి చేశాయి. వెనుకబడిన వర్గాల ప్రయోజనాలకు ఉద్దేశించిన బిల్లులను జాప్యం చేయకుండా ఆమోదం తెలపాలని విన్నవించాయి.
మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సీసీఐ నేత నారాయణతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివేకానంద్ (BRS MLC Vivekanand) గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. గవర్నర్‌ను కలిసేందుకు ప్రభుత్వం అఖిలపక్షల నేతలను ఆహ్వానించగా, బీజేపీ నేతలు రాలేదు. రిజర్వేషన్ల నుంచి ముస్లింలను తొలగించాలని పట్టుబడుతున్న ఆ పార్టీ నేతలు గవర్నర్‌కు కలిసేందుకు వెళ్లలేదు.
BC Reservations | జాప్యం చేయొద్దని విజ్ఞప్తి..
ఆదివారం శాసనసభ, సోమవారం మండలి ఆమోదించిన బిల్లుల గురించి అఖిలపక్ష నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణలో 50 శాతం రిజర్వేషన్లు మించకుండా గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను సవరిస్తూ బిల్లులు ఆమోదించినట్లు తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గతంలో అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపించారని గుర్తు చేసిన నాయకులు.. తాజా బిల్లులను మాత్రం జాప్యం చేయకుండా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.
రిజర్వేషన్ల (BC Reservations) కోసం బీసీ సంఘాలు ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కుల గణన నిర్వహించి బీసీల లెక్కలు తీసిందని చెప్పారు. కుల గణన ద్వారా వచ్చిన డాక్యుమెంట్ ఆధారంగా బిల్లుల ఆమోదం తెలపాలని కోరారు. ఈ నేపథ్యంలో బీసీ జనాభా వివరాలను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు.
BC Reservations | బీసీలకు న్యాయం చేయాలని..
తెలంగాణలో (Telangana) అత్యధికంగా ఉన్న బీసీలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన బిల్లులను ఆమోదించాలని గవర్నర్‌ను కోరినట్లు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) తెలిపారు. గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు సవరణ చేశామని, జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు చెప్పారు. బీసీలకు 42 శాతం కోటా కల్పించాలన్న ప్రతిపాదనకు కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీజేపీ, సీపీఐ తదితర పార్టీలు ఆమోదం తెలిపాయన్నారు. ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కుల గణన డాక్యుమెంట్ ఆధారంగా బిల్లులను ఆమోదించాలని కోరామని చెప్పారు.