అక్షరటుడే, వెబ్‌డెస్క్ : App Taxi Drivers Strike | దేశవ్యాప్తంగా శనివారం ఓలా, ర్యాపిడో, ఉబర్ సేవలు (Uber Services) నిలిచిపోయాయి. తమ డిమాండ్ల సాధన కోసం యాప్ ఆధారిత టాక్సీ, ఆటో-రిక్షా డ్రైవర్ల యూనియన్ సమ్మె చేపట్టింది. దీంతో సేవలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
దేశవ్యాప్తంగా యాప్ ఆధారిత టాక్సీలు, ఆటో డ్రైవర్లు చట్టవిరుద్ధమైన బైక్ టాక్సీ సేవలను (Bike Taxi Services), ఓలా, ఉబెర్, రాపిడో వంటి రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌ల ఛార్జీల విధానాలను వ్యతిరేకిస్తున్నారు. దీనికి నిరసనగా శనివారం సమ్మెకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జరిగే నిరసనలో ఓలా, ఉబెర్, రాపిడో, పోర్టర్ మరియు ఇతర యాప్ ఆధారిత రవాణా సేవలతో సహా ప్రధాన ప్లాట్‌ఫామ్‌లతో సంబంధం ఉన్న డ్రైవర్లు, డెలివరీ కార్మికులు పాల్గొన్నారు.
App Taxi Drivers Strike | ఆరు గంటలు..
ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్ పేరిట డ్రైవర్లు సమ్మెలో పాల్గొన్నారు. వేలాది మంది కార్మికులు ఈ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కనీసం ఆరు గంటల పాటు లాగ్ అవుట్ కానున్నట్లు సమాచారం. భారతదేశం అంతటా పనిచేస్తున్న అనేక కార్మిక సంస్థల మద్దతుతో తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) సమ్మెను ప్రకటించింది. అన్యాయమైన ధరల పద్ధతులు, ఈ రంగంలో బలహీనమైన నియంత్రణకు వ్యతిరేకంగా నిరసన చేపట్టినట్లు పేర్కొంది. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు 2025 ఉన్నప్పటికీ అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్‌లు స్వతంత్రంగా ఛార్జీలను నిర్ణయిస్తూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.
ఓపెన్ పర్మిట్ పాలసీ కింద ఆటో-రిక్షాల సంఖ్య పెరగడంతో ఆదాయం కోల్పోవడంపై డ్రైవర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఆటోలు, క్యాబ్‌లు, బైక్ టాక్సీలు, ఇతర అగ్రిగేటర్ ఆధారిత సేవలతో సహా యాప్ ఆధారిత రవాణా సేవలకు కనీస బేస్ ఛార్జీలను నిర్ణయించాలని యూనియన్ డిమాండ్ చేసింది. ఈ ఛార్జీలను గుర్తింపు పొందిన డ్రైవర్, కార్మిక సంఘాలతో సంప్రదించి ఖరారు చేయాలని కోరింది. ప్రయాణీకుల, వస్తువుల వాణిజ్య రవాణా కోసం ప్రైవేట్, వాణిజ్యేతర వాహనాల వాడకంపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.