అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Smart Ration Cards | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) రేషన్ పంపిణీ విధానంలో పారదర్శకతను మరింత పెంచే దిశగా కీలక చర్యలు చేపట్టింది. అత్యాధునిక సాంకేతికత ఆధారంగా రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులను(Smart Ration Cards) రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు అందిస్తోంది.
వీటిలో ఏటీఎం కార్డులా ఉండే డిజైన్, క్యూఆర్ కోడ్, ఆధార్ ఆధారిత వివరాలతో ప్రజలకు మరింత ఉపయోగకరంగా మారనున్నాయి.పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) తెలిపిన వివరాల ప్రకారం, కొత్తగా ఇచ్చిన స్మార్ట్ కార్డుల్లో పేర్లు, చిరునామా వంటి వివరాల్లో తప్పులుంటే గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా, ఈ నెల సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ‘మనమిత్ర’(Manamitra) వాట్సాప్ సేవ ద్వారా మార్పులు, చేర్పులు చేసుకునే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించనుంది.
Smart Ration Cards | ఇ-పోస్ యంత్రాల్లో సాంకేతిక అప్‌డేట్
తప్పులు సరిదిద్దిన తర్వాత కొత్త కార్డులను ముద్రించి, లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇక రేషన్ డిపోలలో వినియోగించే ఇ-పోస్ యంత్రాలు కూడా ఆధునికీకరించబడ్డాయి. వాటిలో టచ్‌స్క్రీన్, వైఫై, బ్లూటూత్, ఫింగర్‌ప్రింట్ లేదా ఐరిస్ స్కాన్ వంటి ఫీచర్లు జోడించబడ్డాయి. ఇది వేలిముద్రలు పనిచేయని లబ్ధిదారుల కోసం ఐరిస్ స్కాన్ ద్వారా గుర్తింపును నిర్ధారించేందుకు ఉపయోగపడనుంది. కొత్త స్మార్ట్ కార్డుపై ఉండే QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లబ్ధిదారుడి పేరు, చిరునామా, రేషన్ డిపో నంబరు, డిపో ఐడీ వంటి వివరాలు తక్షణమే పొందేలా సదుపాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈ మార్పులు పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను, అధికారులపై జవాబుదారీతనాన్ని పెంచుతాయని అధికారులు వెల్లడిస్తున్నారు.
సుదీర్ఘకాలం పాటు రేషన్ తీసుకోని కుటుంబాల విషయంలో కూడా మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించింది. మూడు నెలలపాటు రేషన్ తీసుకోని కుటుంబాలకు నాలుగో నెల నుంచి పంపిణీ తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. అటువంటి వారు తమ స్మార్ట్ కార్డు(Smart Card)ను సచివాలయాల్లో చూపించి యాక్టివేట్ చేయించుకోవాలి. నవంబర్ 1 తర్వాత స్మార్ట్ కార్డు అవసరమైన వారు రూ.35–50 రుసుము చెల్లించాలి. అనంతరం ప్రభుత్వం కార్డును నేరుగా ఇంటికే పంపిణీ చేస్తుంది.ఈ స్మార్ట్ కార్డుల ద్వారా అనర్హుల తొలగింపు, సరిఅయిన లబ్ధిదారులకు సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలతో ప్రజల అనుభవాన్ని మెరుగుపరిచి, భద్రత, పారదర్శకత, సామర్థ్యం వంటి అంశాల్లో పురోగతి సాధించేందుకు ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది