అక్షరటుడే, వెబ్‌డెస్క్: Exams Schedule | ప్రతి ఏడాది మార్చిలో జరిగే ఇంటర్మీడియట్ (Intermediate) పబ్లిక్ పరీక్షలను ఈసారి నెల ముందుగానే, అంటే ఫిబ్రవరిలో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి (Andhra Pradesh Board of Intermediate Education) నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు చేసినట్లు సమాచారం.
పరీక్షలు ముందుగా పూర్తవడం వల్ల ఏప్రిల్‌లోనే కొత్త విద్యాసంవత్సరం తరగతులను ప్రారంభించేందుకు వీలవుతుందని బోర్డు భావిస్తోంది.పరీక్షల నిర్వహణ విధానంలో కూడా కీలకమైన సంస్కరణలను చేపట్టారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు రోజుకు ఒక్క సబ్జెక్టుకే పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. మొదట సైన్స్ గ్రూప్ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. అవి పూర్తైన తర్వాత భాషా సబ్జెక్టులు, ఆ తర్వాత ఆర్ట్స్ గ్రూప్ పరీక్షలు జరుగుతాయి.
Exams Schedule | పలు మార్పులతో..
ఈ ఏడాది ప్రత్యేకత ఏమిటంటే, కొత్తగా ‘ఎంబైపీసీ’ (MBiPC) అనే గ్రూపును ప్రవేశపెట్టారు. దీంతో విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ పొందారు. ఫలితంగా ఒకే విద్యార్థికి వేర్వేరు గ్రూపుల సబ్జెక్టులు ఉండే అవకాశం ఉండటంతో, ఒకే రోజున రెండు పరీక్షలు నిర్వహించడం సాధ్యపడదన్న కారణంతో ఈ రోజుకు ఒకే పరీక్ష విధానాన్ని అమలు చేస్తున్నారు.ఇక ఇంటర్ ప్రథమ సంవత్సరం నుండి పలు మార్పులు అమల్లోకి వస్తున్నాయి. సిలబస్‌ను పూర్తిగా ఎన్‌సీఈఆర్టీ (NCERT) ప్రమాణాలకు అనుగుణంగా మార్చారు.
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (Biology) సబ్జెక్టులకు 85 మార్కుల రాత పరీక్షను నిర్వహిస్తారు. మిగిలిన మార్కులు రెండో సంవత్సరం ప్రాక్టికల్స్‌కి కేటాయిస్తారు. బయాలజీలో వృక్షశాస్త్రానికి 43, జంతుశాస్త్రానికి 42 మార్కులు కేటాయించారు.అలాగే అన్ని పేపర్లలో ఒక్క మార్కు ప్రశ్నలను కొత్తగా చేర్చారు. అయితే ప్రాక్టికల్ పరీక్షలను జనవరి చివర్లో, థియరీ పరీక్షల ముందు నిర్వహించాలా లేక తర్వాత పెట్టాలా అన్న అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.