అక్షరటుడే, వెబ్‌డెస్క్ : DSC Notification | ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) నిరుద్యోగులకు భారీ ఊరట కలిగించే వార్త ఇది. సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరోసారి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ఉన్న టీచర్ కొరతను తగ్గించడమే లక్ష్యంగా ఫిబ్రవరి నెలలోనే సుమారు 2,500 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ మేరకు డీఎస్సీ నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ ఇప్పటికే అంతర్గతంగా కసరత్తు ప్రారంభించింది. పోస్టుల గుర్తింపు, రిజర్వేషన్ విధానం, పరీక్షా సరళి వంటి అంశాలపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా ఈసారి డీఎస్సీలో కొత్త మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
DSC Notification | కొత్తగా ఇంగ్లీష్, కంప్యూటర్‌పై ప్రత్యేక పేపర్?
తాజా ప్రతిపాదనల ప్రకారం.. ఈసారి డీఎస్సీ పరీక్షలో (DSC Exam) ఇంగ్లీష్ ప్రావీణ్యం, కంప్యూటర్ అవగాహనకు సంబంధించిన ప్రత్యేక పేపర్‌ను ప్రవేశపెట్టే యోచనలో విద్యాశాఖ ఉంది. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. డీఎస్సీతో పాటు ఈ కొత్త పేపర్ పరీక్ష కూడా ఒకేసారి నిర్వహించే అవకాశముంది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలంటే ప్రభుత్వ ఆమోదం అవసరం. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని విద్యాశాఖ (Education Department) అంచనాకు వచ్చింది. దీని వల్ల బోధన నాణ్యతపై ప్రభావం పడుతోందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో మరిన్ని ఖాళీలు ఏర్పడనున్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడానికే ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
విద్యా వ్యవస్థను ఆధునీకరించడమే లక్ష్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సారథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నాణ్యమైన బోధన, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఉపాధ్యాయుల నియామకమే లక్ష్యంగా ఈ మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా చూస్తే, ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది నిరుద్యోగులకు ఇది పెద్ద శుభవార్తగా చెప్పవచ్చు.