అక్షరటుడే, వెబ్డెస్క్ : AP CM Chandrababu | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ ఉపశమనం లభించింది. ఏపీ ఫైబర్నెట్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సీఐడీ (CID) నమోదు చేసిన కేసు అధికారికంగా ముగిసిపోయింది.
ఫైబర్నెట్ (Fibernet) వ్యవహారంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని సీఐడీ స్పష్టం చేయడంతో కేసు మొత్తాన్ని విజయవాడ ఏసీబీ కోర్టు క్లోజ్ చేసింది. 2015లో టీడీపీ ప్రభుత్వ కాలంలో రూ.330 కోట్ల విలువైన ఫైబర్నెట్ ఫేజ్–1 వర్క్ ఆర్డర్ టెర్రాసాఫ్ట్ సంస్థకు కేటాయించడంలో టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసు నమోదైంది.
AP CM Chandrababu | కేసు క్లోజ్..
అప్పటి ఫైబర్నెట్ ఎండీ మధుసూదన రెడ్డి (MD Madhusudhan Reddy )చేసిన ఫిర్యాదు ఆధారంగా 2021లో సీఐడీ విచారణ ప్రారంభించింది. ఆ తర్వాత పలువురిని నిందితులుగా చేర్చగా, 2023లో చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చడం రాజకీయంగా పెద్ద సంచలనంగా మారింది. టెండర్ ప్రక్రియలో జోక్యం చేసుకున్నారని, నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), వేమూరి హరికృష్ణ ప్రసాద్, కోగంటి సాంబశివరావు సహా 16 మందిపై కేసులు నమోదయ్యాయి. దీన్ని రాజకీయ కక్షసాధింపుగా ఆరోపిస్తూ టీడీపీ (TDP) తీవ్రంగా ప్రతిఘటించింది.
తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫైబర్నెట్ మాజీ ఎండీ మధుసూదన రెడ్డి, ప్రస్తుత ఎండీ గీతాంజలి శర్మలు ఏసీబీ కోర్టుకు లిఖితపూర్వకంగా సమర్పించిన నివేదికలో అక్రమాలు ఏవీ లేవని స్పష్టం చేశారు. సీఐడీ కూడా తన నివేదికలో ఇదే విషయాన్ని ధృవీకరించింది. దీనిని కోర్టు పరిశీలించి కేసు పూర్తిగా క్లోజ్ చేసింది. ఈ పరిణామంతో చంద్రబాబు నాయుడిపై ఉన్న మరో కీలక కేసు కూడా క్లోజ్ అయింది. వైసీపీ పాలనలో నమోదైన ఫైబర్నెట్ కేసు నిజానిజాలు వెలుగులోకి వచ్చాయని, ఇది రాజకీయ ప్రేరేపిత కేసేనని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. అప్పుడు చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన మధుసూదన రెడ్డి అనే వ్యక్తి , ఇప్పుడు కేసును క్లోజ్ చేసేందుకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదట. అక్రమాలు జరగలేదన్న సీఐడీ నివేదికతో ఆయన ఏకీభవించడంతో కేసుకి పులిస్టాప్ పడింది.