అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో మరో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పాతబస్తీలోని కామాటిపుర పోలీస్ స్టేషన్ (Kamatipura Police Station) పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నగరంలో ఇటీవల వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల రెయిన్ బజార్లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని దుండగులు హత్య చేశారు. సోమవారం ఉదయం రియల్టర్‌పై కొందరు కాల్పులు జరిపి, కత్తులతో పొడిచి చంపారు. మంగళవారం రాత్రి యువకుడిని వెంబడించి, నడిరోడ్డుపై కత్తులతో నరికి హత మార్చారు. కామాటిపుర పీఎస్ పరిధిలోని దేవి బాగ్ (Devi Bagh) వద్ద అరవింద్ ఘోస్లే(30) అనే యువకుడిని హత్య చేశారు.
Hyderabad | ఇంటికి వెళ్తుండగా..
నందిముస్లైగూడ (Nandimuslaiguda)కు చెందిన అరవింద్ బోస్లే ఓ బియ్యం దుకాణంలో పనిచేసేవాడు. పనులు ముగించుకొని మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. దేవీబాగ్ వద్దకు రాగానే దుండగులు అతడిని వెంబడించి కత్తులతో దాడిచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital)కి తరలించారు. వివాహేతర సంబంధంతోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా నగరంలో ఇటీవల హత్యలు, దాడులు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు చర్యలు చేపడుతున్నా దాడులు మాత్రం ఆగడం లేదు. రోడ్లపై అందరు చూస్తుండగానే కొందరు దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.