అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mono Rail | ముంబైలో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం కర్ణాటకలో రెండు రైళ్లు ఢీకొని 11 మృతి చెందిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో రైలు ఢీకొని ఆరుగురు ప్రయాణికులు చనిపోయారు. తాజాగా ముంబైలో మోనో రైలు (Mono Rail) పట్టాలు తప్పింది.ముంబైలోని వాడాలా-జీటీబీ స్టేషన్ ప్రాంతంలో మోనో రైలు పట్టాలు తప్పింది.
వాడాలా వద్ద ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వడాలా డిపో (Wadala Depot)లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్న సమయంలో బుధవారం ఉదయం మోనోరైల్ రైలు ఓ వైపు వంగిపోయింది. ట్రయల్ రన్ కావడంతో ప్రయాణికులు ఎవరూ లేరు. లోకోపైలెట్లకు కూడా ఎలాంటి గాయాలు కాలేదు. సహాయక సిబ్బందిని వారిని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. ప్రమాదంతో ట్రాక్ కొంత మేర ధ్వంసమైంది.
Mono Rail | సేవలు నిలిపివేత
ముంబై (Mumbai) ప్రజా రవాణా వ్యవస్థలో మోనో రైళ్ల పాత్ర కీలకం. అయితే ఇటీవల సాంకేతిక సమస్యలతో మోనో రైళ్లు మొరాయిస్తున్నాయి. ఆగస్టు 19, సెప్టెంబర్ 15 తేదీలలో మోనోరైళ్లు టెక్నికల్ సమస్యతో నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఈ రైళ్లు ఎలివేటెడ్ ట్రాక్ (Elevated Tracks)పై నడుస్తుంది కాబట్టి, మోనోరైలులో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించడానికి అగ్నిమాపక దళం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ ఘటనల తర్వాత సాంకేతిక మెరుగుదల పనుల కోసం సెప్టెంబర్ 20 నుంచి మోనోరైలు సేవలను అధికారులు నిలిపివేశారు.
మోనోరైలు సేవను మెరుగుపరచడానికి ట్రాక్‌పై కొత్త రైళ్లను ప్రారంభించారు. వాటికి ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా బుధవారం ఉదయం ఒక రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. అధికారులు విచారణ చేపడుతున్నారు.
