అక్షరటుడే, వెబ్‌డెస్క్ : America | అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రోడ్ ఐలాండ్‌లో ఉన్న బ్రౌన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో (Brown University campus) కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
అమెరికాలోని రోడ్ ఐలాండ్‌లోని (Rhode Island) బ్రౌన్ విశ్వవిద్యాలయంలో నల్లటి దుస్తులు ధరించిన ఒక దుండగుడు కాల్పులు జరిపాడు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు విశ్వవిద్యాలయంలో ఫైనల్ పరీక్షలు రాస్తుండగా.. ఈ కాల్పులు జరిగాయి. నిందితుడిని ఇంకా పట్టుకోలేదు. కాల్పులు జరిగిన మూడు గంటల తర్వాత పోలీసు అధికారులు క్యాంపస్ భవనాలను చుట్టుముట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
America | బయటకు రావొద్దు
ఘటనపై మేయర్ బ్రెట్ స్మైలీ మాట్లాడుతూ.. ఆ ప్రాంతంలో షెల్టర్-ఇన్-ప్లేస్ అమలులో ఉందన్నారు. క్యాంపస్ సమీపంలో నివసించే ప్రజలు బయటకు రావొద్దని కోరారు. నిందితుడి కోసం అధికారులు గాలిస్తున్నారని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) కాల్పుల ఘటనపై స్పందించారు. “ఇప్పుడు మనం చేయగలిగేది బాధితుల కోసం ప్రార్థించడమే” అని అన్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సహాయం చేయడానికి ఎటువంటి చర్యలకైనా ఎఫ్‌బీఐ సిద్ధంగా ఉందన్నారు. కాగా ఈ ఘటనలో మృతి చెందింది విద్యార్థులా.. కాదా అనేదానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు.