అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maoists Surrender | ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మంగళవారం 34 మంది మావోయిస్టులు లొంగిపోయారు (Maoists surrendered). రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో వీరు ఆయుధాలు వీడారని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు.
దేశంలో 2026 మార్చి వరకు మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆపరేషన్ కగార్ (Operation Kagar) చేపట్టింది. వేల సంఖ్యలో బలగాలు అడువుల్లో జల్లెడ పడుతున్నాయి. దీంతో ఎన్కౌంటర్లలో అనేక మంది మావోయిస్టులు హతం అయ్యారు. కీలక నేతలు సైతం చనిపోయారు. పలువురు మావోయిస్టు కీలక నేతలు లొంగుబాట ఎంచుకున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు కీలక నేత హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయాడు. అనంతరం లొంగుబాట్లు భారీగా పెరిగాయి.
Maoists Surrender | భారీ రివార్డు
ఆపరేషన్ కగార్తో మావోయిస్టులు బలహీనం అవుతున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం లొంగుబాట్లను ప్రోత్సహిస్తోంది. దీంతో భారీ సంఖ్యలో దళ సభ్యులు ఆయుధాలు వీడి సరెండర్ అవుతున్నారు. తాజాగా లొంగిపోయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఆంధ్ర ఒడిశా సరిహద్దు డివిజన్‌కు చెందిన సభ్యులు ఉన్నారు. వీరిలో 26 మందిపై రూ.1 లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రివార్డు ఉంది.
Maoists Surrender | మొత్తం 824 మంది..
బీజాపూర్ జిల్లాలో 2024 జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 824 మంది మావోయిస్టులు ప్రధాన స్రవంతిలో చేరారని ఎస్పీ తెలిపారు. 1079 మంది అరెస్టు అయ్యారని, వివిధ ఎన్కౌంటర్లలో 220 మంది చనిపోయారని వెల్లడించారు. ప్రభుత్వ పునరావాస పథకం కింద లొంగిపోయిన వారికి తక్షణమే రూ.50,000 ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.