అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BRS | బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా మరో పది మంది మాజీ ఎమ్మెల్యేలు (Former MLA) గులాబీ పార్టీని వీడనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం కాళేశ్వరం కమిషన్ నివేదిక (Kaleshwaram Commission Report) సమర్పించడంతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) అంశంలో కూడా సిట్ విచారణలో దూకుడు పెంచింది. ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు అరెస్ట్‌కు అనుమతి ఇవ్వాలని సిట్ అధికారులు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు నేత తమ దారి తాము చూసుకోవడానికి సిద్ధం అయినట్లు సమాచారం.
BRS | బీజేపీలో చేరడానికి రెడీ
నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ ఇటీవల బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. తాను జాతీయ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే ఏ పార్టీలో చేరేది రెండు రోజుల్లో వెల్లడిస్తానన్నారు. ఆయన బీజేపీలో (BJP) చేరనున్నట్లు సమాచారం. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం కూడా గులాబీ పార్టీకీ రిజైన్ చేశారు. ఆయన కూడా కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది.
BRS | ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న నేతలు
బీఆర్ఎస్ హయాంలో బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిందని పెద్ద ఎత్తున దుమారం రేగిన విషయం తెలిసిందే. ఆపరేషన్ ఫాంహౌస్‌లో పాల్గొన్న బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతారని సమాచారం. ఈ ఆపరేషన్‌లో ఉన్న గువ్వల బాలరాజు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. కేసీఆర్ చెప్పడంతోనే తాను ఫామ్‌హౌస్‌కు వెళ్లినట్లు ఆయన చెప్పారు.
BRS | మొదట నలుగురు
ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు బీజేపీ వైపు చూస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా ఆగస్టు 9న నలుగురు మాజీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో కాషాయ గూటికి చేరనున్నట్లు తెలిసింది. అనంతరం మరో ఆరుగురు మాజీలు సైతం బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. వారు ఇప్పటికే బీజేపీ నేతలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
BRS | ఢిల్లీలో కేటీఆర్
ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఎన్నికల సంఘం సమావేశానికి ఆయన వెళ్లారు. అయితే ఆయన ఢిల్లీలో కీలక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయడం, మరికొందరు సైతం అదేబాటలో ఉన్నారని తెలియడంతో ఆయన ఢిల్లీలో ఎవరిని కలుస్తారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.