అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Spying for Pak | డబ్బుల కోసం దేశ వ్యతిరేక పనులు చేస్తున్న వారు భారత్‌లో చాలా మంది ఉన్నారు. తమ స్వలాభం కోసం దేశ భద్రత (Nation Security)ను పణంగా పెడుతున్న వారిపై నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. నిత్యం పాక్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేస్తుండడంతో.. ఇలాంటి వారు ఇంకెంత మంది ఉన్నారోనని ఆందోళన చెందుతున్నారు. తాజాగా పాకిస్తాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్న మరో వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు (Maharashtra Police) అరెస్ట్ చేశారు.
పాకిస్తాన్‌కు సున్నితమైన సమాచారం అందించినందుకు పూణే(Pune)లో 27 ఏళ్ల ఇంజినీర్ రవీంద్ర వర్మను మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు (ATS Police) అరెస్ట్ చేశారు. నిందితుడి బ్యాంకు ఖాతాలో భారత్‌తో పాటు విదేశాల్లోని వివిధ బ్యాంకు ఖాతాల నుంచి భారీగా డబ్బు జమ అయినట్లు గుర్తించారు. ఐఎస్ఐ ఏజెంట్ (ISI Agent) పాయల్ శర్మ అనే మహిళ పేరుతో రవీంద్రవర్మకు ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. అనంతరం రవీంద్ర వర్మ భారత్‌కు చెందిన రహస్యాలను సదరు వ్యక్తికి చేరవేశాడు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఏటీఎస్ పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా రవీంద్ర వర్మ ఒక రక్షణ సాంకేతిక సంస్థలో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేసేవాడు.
పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam attack), ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. భారత్ ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులతో పాటు, పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పింది. అనంతరం భారత్‌లో ఉంటూ పాక్‌కు పని చేస్తున్న వారిపై దృష్టి సారించింది. ఈ క్రమంలో పాక్‌కు గూఢచర్యం చేస్తున్న వారి వివరాలను నిఘా వర్గాలు సేకరించి పోలీసులకు అందిస్తున్నాయి. ఈ మేరకు ఆయా రాష్ట్ర పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు.