అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MP Manish Tewari | ఆపరేషన్ సిందూర్ చర్చ సందర్భంగా నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా, పార్టీలోని అంతర్గత విభేదాలు బయటకు వస్తున్నాయి. సొంత ఎంపీల నుంచి విమర్శలు వెల్లువెత్తుండడం ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది ఇరుకున పెడుతున్నాయి. పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్ (MP Shashi Tharoor) లోక్‌సభలో జరిగిన చర్చలో ఎందుకు మాట్లాడటం లేదనే దానిపై చర్చ జరుగుతుండగా, మరో ఎంపీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ (social media post) కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేసింది. ఇది బీజేపీకి కొత్త ఆయుధంగా మారింది.
MP Manish Tewari | ఈసారి మనీశ్ తివారీ
కాంగ్రెస్ పార్టీ (Congress party) తీరుపై మరో ఎంపీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ పార్టీకి వ్యతిరేకంగా గళమెత్తుతుండగా, మరో ఎంపీ ఆయనతో జత కలిశారు. కేంద్ర మాజీ మంత్రి, చండీగఢ్ ఎంపీ మనీశ్ తివారీ (Chandigarh MP Manish Tewari) కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా మంగళవారం సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. చర్చలో పాల్గొనకుండా థరూర్‌తో పాటు తనను ఎందుకు పక్కన పెట్టారో పేర్కొంటూ వచ్చిన ఓ వార్త కథనాన్ని స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ 1970లో పూరబ్ ఔర్ పచ్చిమ్ లోని ఎవర్‌గ్రీన్ దేశభక్తి గీతంలోని కొన్ని పదాలను జత చేశారు. “హై ప్రీత్ జహాన్ కీ రీత్ సదా, మెయిన్ గీత్ వహాన్ కే గాతా హూన్, భారత్ కా రెహ్నే వాలా హూన్, భారత్ కీ బాత్ సునాతా హూన్. జై హింద్,” అని కాంగ్రెస్ ఎంపీ రాశారు. తాను భారతదేశం వాణినే వినిపిస్తానని, దేశం కోసమే మాట్లాడతానని అర్థం వచ్చే రీతిలో ఆయన ఈ పోస్టు పెట్టారు.
MP Manish Tewari | ఇరుకున పడిన కాంగ్రెస్..
ఇప్పటికే శశిథరూర్ వైఖరితో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. ఆపరేషన్ సిందూర్‌ను (Operation Sindoor) మొదటి నుంచి సమర్థిస్తున్న ఆయన.. స్వదేశంతో పాటు విదేశాల్లోనూ దీనిపై గళమెత్తారు. ఈ క్రమంలో పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై ఎదురుదాడి చేశారు. ఈ వివాదం కొనసాగుతుండగానే ఇప్పుడు మనీశ్ తివారీ ఆయనకు జత కలవడం కాంగ్రెస్‌కు సంకటంగా మారింది. ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్‌లో మాట్లాడేందుకు ఆయన సిద్ధం కాగా, పార్టీ లైన్‌లోనే మాట్లాడాలని హైకమాండ్ చెప్పడంతో ఆయన నిరాకరించారు. దీంతో కాంగ్రెస్ తరఫున మాట్లాడే వారి జాబితా నుంచి ఆయనను పక్కకు తప్పించారు. ఈ నేపథ్యంలో మనీశ్ తివారీ పెట్టిన పోస్టు ఇప్పుడు చర్చనీయాంశమైంది.