అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | రాష్ట్రాన్ని వరుణుడు వీడటం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వారం రోజులు వర్షాలు కురిశాయి. ఆదివారం వాన కాస్త తెరిపినిచ్చింది. అయితే సోమవారం మళ్లీ పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో సోమవారం నాగర్కర్నూల్, నల్గొండ, గద్వాల, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో సాయంత్రం, రాత్రి సమాయల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Weather Updates | హైదరాబాద్ నగరంలో..
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడుతాయి. హైదరాబాద్ నగరంలో వాతావరణం పొడిగా ఉంటుంది. అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉంది.
Weather Updates | సూర్యుడొచ్చాడు..
రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజులుగా వర్షాలు పడుతున్నాయి. నిత్యం ఆకాశం మేఘావృతమై ఉంది. రెండు రోజులు ముసురు పెట్టింది. దీంతో ఎండ కనిపించక దాదాపు వారం అవుతోంది. తాజాగా సోమవారం ఉదయం ఎండ బాగా వచ్చింది. అయితే మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతం అవుతుందని అధికారులు పేర్కొన్నారు.
కాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. మహిళలు బతుకమ్మ వేడుకల కోసం అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సాయంత్రం వర్షం పడితే ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పండుగ పూట వర్షం పడొద్దని మహిళలు వరుణ దేవుడిని కోరుతున్నారు.