Homeబిజినెస్​Tata Capital IPO | టాటా గ్రూప్‌నుంచి మరో ఐపీవో.. వచ్చేనెల 6 నుంచి ప్రారంభం

Tata Capital IPO | టాటా గ్రూప్‌నుంచి మరో ఐపీవో.. వచ్చేనెల 6 నుంచి ప్రారంభం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tata Capital IPO | టాటా గ్రూప్‌(Tata Group)నకు చెందిన ఎన్‌బీఎఫ్‌సీ(NBFC) దిగ్గజం టాటా క్యాపిటల్‌ పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. వచ్చేనెల 6వ తేదీన సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం కానుంది. ఈ ఐపీవోపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.

టాటా గ్రూప్‌నుంచి మరో ఐపీవో వస్తోంది. ఈ గ్రూప్‌నకు చెందిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ టాటా క్యాపిటల్‌(Tata Capital) రూ. 17,200 కోట్లు సమీకరించేందుకు అనుమతులకోసం ఇప్పటికే సెబీకి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో ఆఫర్‌ ఫర్‌ సేల్‌(OFS) ద్వారా టాటా సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 23 కోట్ల షేర్లను, భాగస్వామ్య సంస్థ అయిన ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మరో 3.58 కోట్ల షేర్లను విక్రయించనుంది. అదనంగా ఫ్రెష్‌ ఇష్యూ(Fresh issue) ద్వారా కంపెనీ 21 కోట్ల షేర్లను జారీ చేయనుంది. కంపెనీలో ప్రస్తుతం టాటా సన్స్‌ వాటా 88.6 శాతం ఉండగా.. ఐఎఫ్‌సీ 1.8 శాతం వాటా కలిగి ఉంది. ఐపీవో ద్వారా వచ్చిన నిధులను భవిష్యత్‌ పెట్టుబడి అవసరాలకుగాను టైర్‌-1 మూలధన పటిష్టతకు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

అతిపెద్ద ఎన్‌బీఎఫ్‌సీగా..

2022 సెప్టెంబర్‌లో అప్పర్‌లేయర్‌ ఎన్‌బీఎఫ్‌సీగా టాటా క్యాపిటల్‌ గుర్తింపు పొందింది. ఆర్‌బీఐ(RBI) నిబంధనల ప్రకారం అప్పర్‌లేయర్‌ ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీ తప్పనిసరిగా మూడేళ్లలో ఐపీవోకు రావాల్సి ఉంది. దీని ప్రకారం టాటా క్యాపిటల్‌ 2025 సెప్టెంబర్‌లోగా పబ్లిక్‌ ఇష్యూకు రావాల్సి ఉంది. వారం రోజులు ఆలస్యంగా ఐపీవోకు వస్తోంది. మార్కెట్‌నుంచి రూ. 17,200 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యం. ఈ ఇష్యూ విజయవంతమైతే దేశీయ ఫైనాన్షియల్‌ రంగంలో అతిపెద్ద ఐపీవోగా రికార్డ్‌ సృష్టించనుంది. ఇటీవల స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయిన హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌(HDB Financial Services) రూ. 12,500 కోట్లు సమీకరించిన విషయం తెలిసిందే.

ముఖ్యమైన తేదీలు..

టాటా క్యాపిటల్‌ ఐపీవో అక్టోబర్‌ 6వ తేదీన ప్రారంభమవుతుంది. 8వ తేదీ వరకు సబ్‌స్క్రిప్షన్‌(Subscription)కు అవకాశం ఉంది. 9వ తేదీ రాత్రి అలాట్‌మెంట్‌ స్టేటస్‌ వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. కంపెనీ షేర్లు అక్టోబర్‌ 13న బీఎస్‌ఈతోపాటు ఎన్‌ఎస్‌ఈలోనూ లిస్టవుతాయి. కాగా ఐపీవో సైజ్‌, ప్రైస్‌బాండ్‌లను కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Must Read
Related News