Homeబిజినెస్​HDFC IPO | హెచ్‌డీఎఫ్‌సీ నుంచి మరో ఐపీవో.. ఈనెలాఖరులో లిస్టయ్యే అవకాశం

HDFC IPO | హెచ్‌డీఎఫ్‌సీ నుంచి మరో ఐపీవో.. ఈనెలాఖరులో లిస్టయ్యే అవకాశం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: HDFC IPO | మార్కెట్‌లోకి మరో మెగా ఐపీవో(Mega IPO) రాబోతోంది. ఇన్వెస్టర్లనుంచి రూ. 12,500 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో హెచ్‌డీబీ (HDB) ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ భారీ ఐపీవోకు వస్తోంది. ఈనెలాఖరులో సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

దేశంలో దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్‌ (private sector bank) అయిన హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) అనుబంధ సంస్థ హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ను ఆర్‌బీఐ అప్పర్‌ లేయర్‌ ఎన్‌బీఎఫ్‌సీ(NBFC)గా గుర్తించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) 2022 అక్టోబర్‌లో జారీ చేసిన సర్క్యులర్‌ ప్రకారం ఈ సంస్థ తప్పనిసరిగా స్టాక్‌ మార్కెట్‌లో లిస్టవ్వాల్సి ఉంటుంది. అప్పర్‌ లేయర్‌ ఎన్‌బీఎఫ్‌సీగా గుర్తించిన మూడేళ్లలో ఈ ప్రక్రియ పూర్తవ్వాలి. హెచ్‌డీబీ ఐపీవోకు రావడానికి ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు గడువుంది. అయితే ఈనెలాఖరు నాటికే లిస్ట్‌ అవడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

ఇందులో భాగంగా కంపెనీ పూర్తి విలువను రూ. 62 వేల కోట్లుగా అంచనా వేశారు. ఇప్పటికే సెబీకి డీఆర్‌హెచ్‌పీ (DRHP) దాఖలు చేశారు. త్వరలోనే ఆర్‌హెచ్‌పీ (RHP) దాఖలు చేసే అవకాశాలున్నాయి. రూ. 2,500 కోట్ల విలువైన కొత్త షేర్లను జారీ చేయడంతోపాటు రూ. 10 వేల కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ విక్రయించనుంది. ఐపీవో ద్వారా వచ్చిన నిధులను కంపెనీ భవిష్యత్‌ మూలధన అవసరాలకోసం ఉపయోగించే అవకాశాలున్నాయి. ఈనెల 25 నుంచి ఐపీవో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. కంపెనీ ఇష్యూ సైజ్‌ పెద్దది కావడంతో దేశంలో అతిపెద్ద ఎన్‌బీఎఫ్‌సీ ఐపీవోగా హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రికార్డు సృష్టించనుంది.