అక్షరటుడే, వెబ్డెస్క్ : Canara HSBC Life IPO | కెనరా బ్యాంక్(Canara bank) నుంచి మరో పబ్లిక్ ఇష్యూ వస్తోంది. శుక్రవారం సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కానుంది. కంపెనీ షేర్లు ఈనెల 17న లిస్టవనున్నాయి.
కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్ ఇన్సూరెన్స్(Canara HSBC Life Insurance) భారత దేశంలోని ప్రైవేట్ జీవిత బీమా సంస్థలలో ఒకటి. దీనిని 2007లో ఏర్పాటు చేశారు. కెనరా బ్యాంక్(Canara bank), హెచ్‌ఎస్‌బీసీ ఇన్సూరెన్స్(ఆసియా పసిఫిక్) హోల్డింగ్ లిమిటెడ్ ప్రమోట్ చేస్తున్నాయి. ఈ కంపెనీ దేశమంతటా వ్యక్తిగత, గ్రూప్ ఇన్సూరెన్స్ సేవలను అందిస్తోంది. టర్మ్, సేవింగ్స్, పదవీ విరమణ, ఎండోమెంట్ పాలసీలు అందిస్తుంది. గ్రూప్ క్రెడిట్ లైఫ్ అండ్ ప్రొటెక్షన్ ప్లాన్‌లు, యాన్యుటీ ప్లాన్‌లు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీలు ఉన్నాయి.
టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాల్లో 10.51 మిలియన్‌లకు పైగా పాలసీలున్నాయి. ఈ కంపెనీ మార్కెట్‌నుంచి రూ. 2,517.50 కోట్లు సమీకరించడం కోసం ఐపీవో(IPO)కు వస్తోంది. ఒక్కొక్కటీ రూ.10 ముఖ విలువ(Face value) కలిగిన 23,75,00,000 షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయిస్తున్నారు. ఇందులో కెనరా బ్యాంకు 13,77,50,000 షేర్లు, హెచ్‌ఎస్‌బీసీ ఇన్సూరెన్స్(HSBC Insurance) 47,50,000 షేర్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB) 9,50,00,000 షేర్లు విక్రయిస్తున్నాయి. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్(Offer for sale). అంటే ఐపీవో ద్వారా వచ్చే ఆదాయంలో ఒక్క రూపాయి కూడా కంపెనీకి వెళ్లదు. మొత్తం ప్రమోటర్లకు వెళ్తుంది.
Canara HSBC Life IPO | ఆర్థిక పరిస్థితి
కంపెనీ పన్ను తర్వాత లాభం(Profit after tax)లో స్థిరమైన పెరుగుదల కనిపిస్తోంది. 2022 -23 ఆర్థిక సంవత్సరంలో ప్యాట్ రూ. 15.27 కోట్లు ఉండగా.. 2023 -24 ఆర్థిక సంవత్సరానికి రూ. 75.65 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్యాట్ రూ. 81.15 కోట్లుగా నమోదయ్యింది.
కోటా, జీఎంపీ : క్యూఐబీ(QIB)లకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం కోటా కేటాయించారు. ఈ కంపెనీ షేర్లకు ప్రస్తుతం జీఎంపీ రూ. 10 ఉంది. అంటే లిస్టింగ్ సమయంలో 9 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్రైస్ బ్యాండ్ : ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ.100 నుంచి రూ. 106గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 140 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్(Price band) వద్ద రూ. 14,840తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు : కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ(Public issue) ఈనెల 10న ప్రారంభమవుతుంది. 14న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం గురువారమే విండో తెరిచి ఉంది. 15 న రాత్రి అలాట్‌మెంట్ స్టేటస్ తెలిసే అవకాశాలున్నాయి. ఈ కంపెనీ షేర్లు ఈనెల 17న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి.