అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TechD Cybersecurity Limited | స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యేందుకు చాలా కంపెనీలు క్యూ కడుతున్నాయి. కొన్ని కంపెనీలు నిరాశపరుస్తుండగా.. మరికొన్ని కాసుల పంట పండిస్తున్నాయి. తాజాగా సోమవారం ప్రారంభమైన ఓ ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ ఐపీవో(SME IPO) ఆసక్తి రేపుతోంది. గ్రే మార్కెట్ ప్రీమియం భారీగా ఉండడమే దీనికి కారణం.
టెక్ డీ సైబర్ సెక్యూరిటీ లిమిటెడ్(TechD Cybersecurity Limited)ను 2017లో స్థాపించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ సేవలు అందిస్తోంది. ఎంఎస్‌ఎస్‌పీ సొల్యూషన్స్, సైబర్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్, వీఏపీటీ, కంప్లైయన్స్ సర్వీసెస్, స్పెషలైజ్డ్ సర్వీసెన్, స్టాఫ్ అగ్మెంటేషన్ వంటి సేవలను ఆఫర్ చేస్తోంది. దీని క్లయింట్లుగా అదానీ గ్రూప్(Adani Group), జెన్సార్ టెక్నాలజీస్, ఆస్ట్రల్ లిమిటెడ్, కేడియా క్యాపిటల్, ఐక్యూఎం కార్పొరేషన్ వంటి సంస్థలున్నాయి. ఈ సంస్థ రూ. 38.99 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వచ్చింది. పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించనుంది.
ఆర్థిక పరిస్థితి : కంపెనీ రెవెన్యూ, నికరలాభంతోపాటు ఆస్తులూ ఏటా గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 7.59 కోట్ల ఆదాయం(Revenue) రాగా.. 2023-24 నాటికి అది రూ. 15.36 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రెట్టింపై రూ. 30.23 కోట్లకు చేరింది. ఇక నికర లాభం(Net profit) సైతం అలాగే పెరుగుతోంది. 2022-23లో రూ. 0.94 కోట్లు, 2023-24 లో రూ. 3.24 కోట్లు, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 8.40 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్లుగా తెలిపింది. అలాగే 2023లో రూ. 6.98 కోట్ల ఆస్తుల(Assets)ను కలిగి ఉండగా.. 2024 నాటికి రూ. 9.14 కోట్లకు చేరాయి. ఇక 2025 మార్చి చివరి నాటికి రూ. 29.08 కోట్లకు పెరిగాయి.
ధరల శ్రేణి : గరిష్ట ప్రైస్‌బాండ్(Higer price band) వద్ద ఒక్కో షేరు ధరను రూ.193గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 600 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు రెండు లాట్ల కోసం రూ. 2,31,600 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు : కంపెనీ పబ్లిక్ ఇష్యూ సోమవారం ప్రారంభమైంది. 17వ తేదీ వరకు కొనసాగనుంది. 18 రాత్రి షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ తెలిసే అవకాశాలున్నాయి. 22న కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈ(NSE)లో లిస్టవుతాయి.
జీఎంపీ, సబ్‌స్క్రిప్షన్ వివరాలు : ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఒక్కో ఈక్విటీ షేరు రూ. 158 ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది. అంటే ఐపీవో అలాట్ అయితే లిస్టింగ్ సమయంలోనే 81 శాతం లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ ఐపీవోకు విశేష స్పందన లభిస్తోంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 7.58 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. రిటైల్ కోటా 11.46 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ కావడం గమనార్హం. మరో రెండు రోజులు గడువుండడంతో సబ్‌స్క్రిప్షన్ భారీగా అయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.