అక్షరటుడే, వెబ్‌డెస్క్ : LG Electronics IPO | దేశీయ స్టాక్ మార్కెట్(Domestic stock market)నుంచి డబ్బులు సమీకరించేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. మరో పెద్ద కంపెనీ పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది.
ఈనెల 7న ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా(LG Electronics India) సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కానుంది. ఇది ఈ వారంలో ప్రారంభం కానున్న రెండో అతిపెద్ద కంపెనీ. రూ. 15,511 కోట్లతో వస్తున్న టాటా క్యాపిటల్(Tata Capital) ఐపీవో ఈనెల 6న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ విభాగంలో ప్రముఖ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్.. భారత్‌లో 1997లో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇది వాషింగ్ మిషన్లు, ఫ్రిజ్‌లు, టీవీ(TV)లు, ఏసీలు, మైక్రోవేవ్ ఓవెన్‌ల ఉత్పత్తులలో మార్కెట్ లీడర్‌గా ఉంది. ఈ కంపెనీ దేశవ్యాప్తంగా 35,640 దుకాణాల ద్వారా తన ఉత్పత్తుల(Products)ను విక్రయిస్తోంది. 2011 నుంచి 2023 వరకు 13 ఏళ్ల పాటు భారత్‌లో అత్యధిక విక్రయాలు జరిపిన సంస్థగా నిలిచింది.
మన దేశంలో గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ మార్కెట్ 2019 -2024 మధ్య 7 శాతం వృద్ధి చెందింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపకరణాల వినియోగం పెరగడం, నగరీకరణ, పెరుగుతున్న ఆదాయాల నేపథ్యంలో 2024 -2029 మధ్య ఈ వృద్ధి 11 శాతానికి పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కంపెనీ ఐపీవో(IPO)కు వస్తోంది. మార్కెట్‌నుంచి రూ. 11,607 వేలు కోట్లు సమీకరించాలన్నది లక్ష్యం. ఇది పూర్తిగా ఆఫర్ పర్ సేల్(Offer For Sale). దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ మాతృ సంస్థ 10.18 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం దానికే వెళ్తుంది.
ఫైనాన్షియల్ రిపోర్ట్
2023 – 24 ఆర్థిక సంవత్సరంలో రూ. 21,557.12 కోట్ల ఆదాయం(Revenue) ద్వారా రూ. 1,511.07 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా.. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో రూ. 24,630.63 కోట్ల ఆదాయం ద్వారా రూ. 2,203.35 కోట్ల లాభాన్ని(Profit) సంపాదించింది. ఇదే సమయంలో ఆస్తులు రూ. 8,498.4 కోట్లనుంచి రూ. 11,517.15 కోట్లకు చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ. 6,337.36 కోట్ల ఆదాయం ద్వారా రూ. 513.26 కోట్లు సంపాదించినట్లు ఆర్‌హెచ్‌పీలో పేర్కొంది.
ధరల శ్రేణి : కంపెనీ ధరల శ్రేణి(Price band)ని రూ. 1,080 నుంచి రూ. 1,140 మధ్యలో నిర్ణయించింది. ఒక లాట్‌లో 13 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం కనీసం రూ. 14,820 (గరిష్ట ప్రైస్‌బ్యాండ్ వద్ద)తో బిడ్ వేయాల్సి ఉంటుంది.
కోటా, జీఎంపీ : క్యూఐబీలకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్ల(Retail investors)కు 35 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం కోటా కేటాయించారు. ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ రూ. 100 ఉంది. అంటే ఐపీవో ఇన్వెస్టర్లకు లిస్టింగ్ రోజున 8 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు..
ఐపీవో ప్రారంభ తేదీ : అక్టోబర్ 7.
ముగింపు తేదీ : అక్టోబర్ 9.
షేర్ల తాత్కాలిక అలాట్‌మెంట్ : అక్టోబర్ 10 వ తేదీ.
లిస్టింగ్ తేదీ : అక్టోబర్ 14న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతుంది.