అక్షరటుడే, వెబ్డెస్క్ : ATM Theft | నిజామాబాద్ (Nizamabad) నగరంలో మరోసారి ఏటీఎం దొంగలు హల్చల్ చేశారు. ఓ ఏటీఎంలో చోరీకి దొంగలు విఫలయత్నం చేయడం కలకలం రేపింది. ఇటీవలే నగరంలో రెండు ఏటీఎంలో దుండగులు చోరీకి పాల్పడి రూ. 36 లక్షలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఇంతలోనే మరో ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది.
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ నగరంలోని గౌతమి కాలేజ్ (Gautami College) సమీపంలో గల ఎస్బీఐ ఏటీఎంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత సుమారు 2.30 గంటల సమయంలో దుండగులు ఏటీఎంలోకి చొరబడ్డారు. ఏటీఎంలో సొత్తు చోరీకి యత్నిస్తుండగా.. ఈ సమయం లో అటుగా వెళుతున్నపెట్రోలింగ్ సిబ్బంది (Petrolling Staff) గమనించారు. వెంటనే వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా దుండగులు పరారయ్యారు. కాగా.. దొంగలు ఎరుపు రంగు వాహనంలో వచ్చినట్లుగా తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ATM Theft | ఇటీవల రెండు ఏటీఎంలలో చోరీ..
నగరంలో ఇటీవల దొంగలు రెండు ఏటీఎంలలో చోరీకి పాల్పడిన విషయం తెలిసిందే. ఒకేరోజు రెండు ఏటీఎంలలో మిషన్లను తగలబెట్టి వాటిలోని రూ.36 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనను పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంది. ఈ కేసు దర్యాప్తులో ఉండగా.. మరోసారి దొంగలు రెచ్చిపోవడం గమనార్హం.