Jammu and Kashmir | జ‌మ్మూకాశ్మీర్‌లో మ‌రో ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్దరు ఉగ్ర‌వాదులు హ‌తం
Jammu and Kashmir | జ‌మ్మూకాశ్మీర్‌లో మ‌రో ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్దరు ఉగ్ర‌వాదులు హ‌తం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jammu and Kashmir : జ‌మ్మూకశ్మీర్‌లో బుధ‌వారం మరో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను (terrorists) మ‌ట్టుబెట్టిన రెండ్రోజుల వ్య‌వ‌ధిలోనే మ‌రో ఎన్‌కౌంట‌ర్ చోటుచేసుకుంది. భ‌ద్ర‌తా బ‌ల‌గాల కాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు.

బుధ‌వారం (జులై 30) ఉదయం జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. వీరు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు (Lashkar-e-Taiba) చెందిన వారని అనుమానిస్తున్నారు.

Jammu and Kashmir : కొన‌సాగుతున్న సెర్చ్ ఆప‌రేష‌న్‌..

జ‌మ్మూకశ్మీర్‌లో ఉగ్ర‌వాద వేట కొన‌సాగుతోంది. ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌, జ‌మ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేప‌ట్టిన ఆప‌రేష‌న్ మ‌హాదేవ్ (Operation Mahadev) ముమ్మ‌రంగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలోనే తాజా ఎన్‌కౌంట‌ర్ చోటుచేసుకుంది.

పూంచ్ సెక్టార్‌లో (​​Poonch sector) ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద కదలిల‌కను గమనించిన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అక్క‌డ‌కు చేరుకుని త‌నిఖీలు చేప‌ట్టాయి. ఈ క్ర‌మంలో ముష్క‌రులు కాల్పులు జ‌రప‌గా, బ‌ల‌గాలు ఎదురుదాడికి దిగాయి.

ఈ క్ర‌మంలో ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టిన‌ట్లు ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ‘X’లో పోస్ట్ చేసింది. “పూంచ్ సెక్టార్‌లోని జెన్ ప్రాంతంలోని స‌రిహ‌ద్దు వెంట ఇద్దరు వ్యక్తుల కదలికలను సొంత దళాలు గమనించాయి. ఈ క్ర‌మంలో కాల్పులు జరిగాయి. ఆపరేషన్ జరుగుతోంది” అని పేర్కొంది.

అయితే, ముష్క‌రులు, భద్రతా దళాల మ‌ధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హ‌త‌మ‌య్యార‌ని జమ్మూకశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నళిన్ ప్రభాత్ వెల్ల‌డించారు. 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు శ్రీనగర్ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన రెండు రోజుల తర్వాత పూంచ్‌లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

ఆపరేషన్ మహాదేవ్‌లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులు సులేమాన్, ఆఫ్ఘనిస్తాన్, జిబ్రాన్ పహల్గామ్‌లోని (Pahalgam) బైసరన్ లోయలో (Baisaran Valley) అమాయకులను దారుణంగా కాల్చి చంపిన హంతకులని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్ల‌మెంట్‌లో జరిగిన చర్చ సందర్భంగా వెల్ల‌డించారు.