Homeబిజినెస్​Reliance | రిలయన్స్‌ నుంచి మరో కంపెనీ.. ఏఐ సేవల్లోకి అంబానీ

Reliance | రిలయన్స్‌ నుంచి మరో కంపెనీ.. ఏఐ సేవల్లోకి అంబానీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Reliance | దేశంలో మార్కెట్‌ విలువ పరంగా అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries).. మరో కొత్త కంపెనీని ఏర్పాటు చేసింది. ఏఐ(AI) సేవలు అందించేందుకు రిలయన్స్‌ ఇంటెలిజెన్స్‌ (Reliance Intelligence) పేరుతో అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసినట్లు ఎక్స్ఛేంజ్​  ఫైలింగ్స్‌లో పేర్కొంది.

దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీకి (Mukesh Ambani) చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. ఆయిల్‌, కెమికల్స్‌, రిటైల్‌, ఫైనాన్షియల్‌, టెలికాం, గ్రీన్‌ ఎనర్జీ ఇలా పలు రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. తాజాగా ఏఐ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఇటీవల రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వార్షిక సాధారణ సమావేశంలో (AGM) రిలయన్స్‌ ఇంటెలిజెన్స్‌ గురించి అంబానీ ప్రస్తావించిన విషయం తెలిసిందే.

గతంలో టెలికాం సేవలను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తెచ్చిన విధంగానే.. ఆర్టిపిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరికీ చేరువ చేసేందుకు రిలయన్స్‌ ఇంటెలిజెన్స్‌ కృషి చేస్తుందని ఆ సమావేశంలో పేర్కొన్నారు. ఇందుకోసం గూగుల్‌, మెటా భాగస్వామ్యంలో పనిచేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రిలయన్స్‌ ఇంటెలిజెన్స్‌ను పూర్తి స్థాయిలో అనుబంధ కంపెనీగా ఏర్పాటు చేసినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ఫైలింగ్‌లో (Exchange filling) పేర్కొంది. దీనికి సంబంధించి కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా సర్టిఫికెట్‌ లభించినట్లు కంపెనీ తెలిపింది.

Reliance | స్వల్పంగా పెరిగిన రిలయన్స్‌ షేర్లు

రిలయన్స్‌ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ప్రకటన నేపథ్యంలో శుక్రవారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ధర(Stock price) స్వల్పంగా పెరిగింది. 0.85 శాతం పెరిగి రూ. 1,395 వద్ద ముగిసింది. క్రితం సెషన్‌తో పోల్చితే ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 11.70 పెరిగింది. కంపెనీ మార్కెట్‌ విలువ ప్రస్తుతం రూ. 18.88 లక్షల కోట్లు. స్టాక్‌ 52 వారాల కనిష్ట ధర రూ. 1114.85 కాగా.. 52 వారాల గరిష్ట ధర రూ. 1,551 ఉంది. ఇన్వెస్టర్లకు మూడేళ్లలో 20 శాతం రాబడులు అందించిన ఈ కంపెనీ.. గడిచిన ఏడాది కాలంలో మాత్రం 3.89 శాతం నష్టాలను మిగిల్చింది.

Must Read
Related News