అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sunil Gavaskar | భారత వన్డే జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోవడం మనం చూశాం. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి , యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ను కొత్త వన్డే కెప్టెన్‌గా బీసీసీఐ(BCCI) ప్రకటించింది. ఈ నిర్ణయంతో రోహిత్ శర్మ యుగం ముగిసినట్లేనని క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది.
ఆస్ట్రేలియా టూర్ కోసం జట్టును ప్రకటించిన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ , “రోహిత్ ఇకపై కేవలం బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతాడు” అని స్పష్టం చేశారు. అయితే, ఈ పరిణామాల నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడుతూ ఆయన “రోహిత్ శర్మకు త్వరలోనే మరో బ్యాడ్ న్యూస్ రాబోతోంది” అని చెప్పారు.
Sunil Gavaskar | గవాస్కర్ ఏమన్నారంటే..
“అవును, ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ వస్తుంది. మీరు నిబద్ధతతో లేకపోతే, రాబోయే రెండేళ్లకు సిద్ధంగా ఉండలేకపోతే, ఆ నిర్ణయాలు తప్పవు. మీరు కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నట్లయితే, మీకు మరింత ప్రాక్టీస్ అవసరం అవుతుంది. విజయ్ హజారే ట్రోఫీ వంటి దేశవాళీ టోర్నీల్లో పాల్గొనాలి, లేనిపక్షంలో ఫిట్నెస్, ఫార్మ్ కోల్పోవచ్చు అని గవాస్కర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు రోహిత్ శర్మ కేవలం వన్డేలు మాత్రమే ఆడతాడు. కానీ 2027 ప్రపంచ కప్ వరకు భారత జట్టుకు పెద్దగా వన్డే మ్యాచ్‌లు లేవు.
ఈ పరిస్థితుల్లో రోహిత్(Rohit Sharma)కు అవసరమైనంత ప్రాక్టీస్, మ్యాచ్ అనుభవం లభించదు. అందుకే శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించే నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. చివరికి జట్టు ప్రయోజనాలే ముఖ్యమని, గవాస్కర్ స్పష్టం చేశారు. రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పించడంపై అభిమానుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది జట్టు పునర్నిర్మాణానికి ఇది అవసరమని అంటుంటే, మరికొందరు రోహిత్‌ను పక్కనపెట్టడం “దారుణమైన నిర్ణయం” అని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డే బ్యాట్స్‌మన్‌గా కొనసాగనున్నారు. కానీ గవాస్కర్ హెచ్చరికలతో ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే అంశం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.