అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delhi Airport | ఢిల్లీలోని (Delhi) ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI)లో చోటుచేసుకున్న ఓ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్యూ విషయంలో తలెత్తిన వాగ్వివాదం చివరకు భౌతిక దాడికి దారి తీసిందన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఓ పైలట్ (Air India Express pilot) తనపై దాడి చేశాడని స్పైస్‌జెట్ ప్రయాణికుడు అంకిత్ దేవాన్ ఆరోపించడంతో, విమానయాన రంగంలో ఈ ఘటన సంచలనంగా మారింది.బాధితుడు అంకిత్ దేవాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన తన నాలుగు నెలల చిన్నారి సహా కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్నారు. పసిపాప ఉండటంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది సూచన మేరకు స్టాఫ్/పీఆర్ఎమ్ (PRM) సెక్యూరిటీ చెక్ లైన్ ద్వారా వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.
Delhi Airport | ప్రయాణికుడిపై దాడి..
అయితే అక్కడ కొంతమంది సిబ్బంది క్యూను పాటించకుండా ముందుకు వెళ్లడాన్ని గమనించిన దేవాన్ Devan అభ్యంతరం తెలిపారు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ కెప్టెన్ వీరేందర్ తనను తీవ్రంగా అవమానించాడని దేవాన్ ఆరోపించారు. “నువ్వేమైనా నిరక్షరాస్యుడివా? ఇది సిబ్బంది కోసం అని రాసి ఉన్న బోర్డు చదవడం రాదా?” అంటూ పైలట్ తనను దూషించాడని చెప్పారు. ఈ మాటలతో వాగ్వివాదం తీవ్రతరమై, చివరకు పైలట్ తనపై భౌతిక దాడికి పాల్పడ్డాడని దేవాన్ తెలిపారు.ఈ దాడిలో తనకు గాయాలై రక్తం వచ్చిందని, పైలట్ చొక్కాపై కనిపిస్తున్న రక్తం కూడా తనదేనని పేర్కొన్నారు. దాడికి సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం మరింత వైరల్ అయింది.
ఈ ఘటన వల్ల కుటుంబంతో కలిసి వెళ్లాల్సిన విహారయాత్ర నాశనమైందని, తన చిన్న కూతురు తీవ్ర భయాందోళనకు గురైందని అంకిత్ దేవాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమ ఉద్యోగి ప్రమేయం ఉన్న ఈ సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఇలాంటి ప్రవర్తనను ఖండిస్తున్నామని తెలిపింది.
ఘటన జరిగిన సమయంలో సదరు పైలట్ Pilot మరో ఎయిర్‌లైన్‌లో ప్రయాణికుడిగా వెళ్తున్నాడని స్పష్టం చేసింది. విచారణ పూర్తయ్యే వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న పైలట్‌ను విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించింది. అలాగే ఈ ఘటనపై పూర్తిస్థాయిలో అంతర్గత విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని, చట్టపరమైన సంస్థలకు పూర్తి సహకారం అందిస్తామని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది. మరోవైపు, ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు కూడా వివరాలు సేకరిస్తూ దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.