అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ahmedabad | స్కూల్‌లో జరిగిన చిన్న గొడవ ఓ విద్యార్థి (Student) ప్రాణం బలిగొంది. మరోచోట టీచర్ తన ప్రేమను నిరాకరించిందని ఓ విద్యార్థి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటన చోటు చేసుకుంది. 24 గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండు ఉదంతాలు భయాందోళనకు గురి చేశాయి.
అహ్మదాబాద్‌లోని (Ahmedabad) ఖోఖారాలోని సెవెంత్ డే స్కూల్‌లో (Seventh Day School) ఇద్దరు పిల్లల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి 8వ తరగతి చదువుతున్న జూనియర్‌ను కత్తితో పొడిచి చంపాడు. చిన్న గొడవ కారణంగా ఇద్దరి మధ్య ఘర్షణగా మారింది. దీంతో కోపోద్రిక్తుడైన సీనియర్ కత్తి తీసుకుని మంగళవారం స్కూల్ వచ్చాడు. స్కూల్ ఆవరణలో జూనియర్ కనిపించగానే కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. గాయపడిన విద్యార్థిని చికిత్స కోసం మణినగర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి (Maninagar Private Hospital) తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. సమీపంలో పార్క్ చేసిన పాఠశాల బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. అలాగే పాఠశాలలోకి చొరబడి ప్రిన్సిపాల్‌తో పాటు టీచర్లు, సిబ్బందిపై దాడి చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు.
Ahmedabad | టీచర్‌ను ప్రేమించి..
టీచర్‌పై ప్రేమ పెంచుకున్న ఓ విద్యార్థి ఆమె నిరాకరించడంతో ఉన్మాదిగా మారాడు. పెట్రోల్‌తో దాడి చేసి ఆమెను తీవ్రంగా గాయ పరిచాడు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్ నర్సింగ్‌పూర్ జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండ్రోజుల క్రితం చోటు చేసుకుంది. 18 ఏళ్ల సూర్యాంశ్ కొచ్చార్.. తమ స్కూల్‌లో పాఠం చెప్పే టీచర్‌పై ప్రేమ పెంచుకున్నాడు. ఈ విషయాన్ని టీచర్‌కు చెప్పగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇదే విషయాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో బాలుడ్ని స్కూల్ నుంచి సస్పెండ్ చేశారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్కూల్‌కు వెళ్తున్న సదరు టీచర్‌ను సూర్యాంశ్ కొచ్చార్ కామెంట్ చేశాడు.
దీంతో ఆమె బాలుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. టీచర్‌పై కోపం పెంచుకున్న విద్యార్థి ఆగస్టు 18వ తేదీన పెట్రోల్ బాటిల్ తీసుకుని ఆమె ఇంటికి వెళ్లాడు. టీచర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. గమనించిన స్థానికులు మంటలు ఆర్పి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న బాలుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.