అక్షరటుడే, ఇందూరు: Anganwadi teachers | అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చలో సెక్రెటేరియట్ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రయత్నిస్తే పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం తగదని సీపీఎం (CPM) జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు అన్నారు.
సీఐటీయూ (CITU) జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్తో పాటు జిల్లాలోని పలువురు అంగన్వాడీలను గురువారం ఉదయం నుంచి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల నిర్బంధాలు ఉద్యమాన్ని ఆపలేమన్నారు. ప్రజాపాలన అని చెప్పుకుంటున్న ప్రభుత్వం సమస్యలను చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.
అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. ఎంతగా నిరోధించాలని ప్రయత్నించినప్పటికీ వందలాది మంది హైదరాబాద్కు (Hyderabad) తరలి వెళ్లారని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న అంగన్వాడీలను పరామర్శించి వారితో పాటు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సవిత, స్వాతి, విజయ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.