అక్షరటుడే, వెబ్‌డెస్క్: AndhraPradesh | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం రక్షణ రంగ అభివృద్ధిలో మరో ముందడుగు వేయడానికి సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త ఏరోస్పేస్ & డిఫెన్స్ పాలసీని ప్రకటించనుంది. మొత్తం 15,000 ఎకరాల్లో నాలుగు నోడ్లను అభివృద్ధి చేయనుండగా, ఈ ప్రణాళికకు, వచ్చే ఐదు సంవత్సరాలలో రూ. 30,000 కోట్ల పెట్టుబడులు రావడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. నాలుగు రక్షణ రంగ పారిశ్రామిక నోడ్‌లు ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలు దానిలో పొందుపరిచింది. దేశంలో రెండు రక్షణ రంగ పరిశ్రమల కారిడార్‌లను కేంద్రం అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే వాటిని ఇతర రాష్ట్రాలకు కేటాయించింది.
AndhraPradesh | రూ.30 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం..
రాష్ట్రంలో నాలుగు రక్షణ రంగ పారిశ్రామిక నోడ్‌ల(Industrial node) అభివృద్ధికి కొత్త పాలసీలో మార్గదర్శకాలను ప్రభుత్వం సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అనంతపురం జిల్లా లేపాక్షి నుంచి కర్నూలు (Kurnool) జిల్లా ఓర్వకల్ మధ్య భారీ నోడ్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. దీన్ని జాతీయ రహదారికి అనుసంధానంగా ఏర్పాటు చేయనున్నారు. బెంగళూరుకు దగ్గరగా ఉన్న ప్రాంతం కావడంతో రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ సంస్థలను ఆకర్షించే అవకాశం ఉంటుందని భావిస్తుంది. నెల్లూరు- దొనకొండ మధ్య మరో నోడ్ అభివృద్ధికి అధికారులు ప్రతిపాదించారు. దొనకొండ దగ్గర భారీ విస్తీర్ణంలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి.
రామాయపట్నం పోర్టు(Ramayapatnam Port)కు దగ్గరగా నోడ్‌ను అభివృద్ధి చేయడం వల్ల ఎగుమతులకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. విశాఖపట్నం దగ్గర మరో నోడ్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. దీని కోసం కనీసం 2వేల ఎకరాలను సేకరించాలని భావిస్తోంది. జగ్గయ్యపేట దగ్గర మరో డిఫెన్స్ నోడ్‌ను అధికారులు ప్రతిపాదించారు. దీనికోసం సుమారు 2 వేల ఎకరాలను ఇప్పటికే గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. రాడార్, వెపన్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ కేంద్రాన్ని సంస్థ ఏర్పాటు చేయనుంది. భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ శ్రీసత్యసాయి జిల్లా(Sri Sathya Sai District) మడకశిరలో డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్(Defense Manufacturing Unit)ను ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. క్షిపణులు, వార్‌హెడ్స్ తయారీ యూనిట్ ఏర్పాటు కోసం వెయ్యి ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.