అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Andhra University Tensions | విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ (Andhra University Campus)లో గత కొన్ని రోజులుగా లెఫ్ట్, రైట్ వింగ్ విద్యార్థి సంఘాల మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి. క్యాంపస్ ప్రశాంతతకు భంగం కలిగించే చర్యలను అడ్డుకునేందుకు యూనివర్సిటీ యాజమాన్యం రంగంలోకి దిగింది. మతపరమైన కార్యక్రమాలు, క్యాండిల్ మార్చ్‌లు వంటి కార్యక్రమాలు నిర్వహించరాదని, అనుమతి లేకుండా బయటి వ్యక్తులు క్యాంపస్‌లోకి రాకూడదని నోటీసు జారీ చేసింది.
Andhra University Tensions | గొడవకు కారణం ఏమిటి?
గత కొన్ని నెలలుగా రైట్ వింగ్‌కు చెందిన విద్యార్థులు, ఇతర కాలేజీలకు చెందిన కొంతమంది విద్యార్థులతో కలిసి యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో కర్రసాము, కవాతు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మతపరమైన నినాదాలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి వ్యతిరేకంగా లెఫ్ట్ విద్యార్థి సంఘాలైన ఎస్ఎఫ్ఐ Students’ Federation of India (SFI), పీడీఎస్ఓ Progressive Democratic Students Organisation (PDSO)కు చెందిన విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఫిబ్రవరి 17 రాత్రి ఈ ఉద్రిక్తత కొట్లాటకు దారితీసింది. ఇరు వర్గాల విద్యార్థులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.
Andhra University Tensions | మరుసటి రోజు కూడా ఉద్రిక్తత
18వ తేదీ ఉదయం ఏబీవీపీ (ABVP) విద్యార్థులు వైస్ ఛాన్స్‌లర్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. “యూనివర్సిటీ ఎవరి సొత్తూ కాదు. మేమూ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల విద్యార్థులమే. ‘భారత్ మాతా కి జై’ అనడం తప్పా?” అని వారు ప్రశ్నించారు. అదే సమయంలో SFI, PDSO విద్యార్థులు కూడా VCని కలవడానికి రావడంతో మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. తమపై చెప్పులు, ప్లాస్టిక్ బాటిల్స్ విసిరారని, కొందరికి గాయాలయ్యాయని విద్యార్థులు ఆరోపించారు. ఘటన జరిగిన సమయంలో వైస్ ఛాన్స్లర్ అక్కడ లేరని సమాచారం.
విద్యార్థుల (Students) మధ్య జరిగిన గొడవల తర్వాత కూడా క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో యాజమాన్యం కఠిన చర్యలకు దిగింది. విద్యార్థులు చదువులపై దృష్టి పెట్టాలని, క్యాంపస్ ప్రశాంతతకు భంగం కలిగిస్తే తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీలో ఇలాంటి మత సంబంధ వివాదాలు చోటు చేసుకోవడం పట్ల విశాఖ ప్రజలు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, పూర్వ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంస్థల్లో రాజకీయ, మతపరమైన ఉద్రిక్తతలు పెరగకుండా అన్ని వర్గాలు సంయమనంతో వ్యవహరించాలని వారు కోరుతున్నారు.