అక్షరటుడే, వెబ్‌డెస్క్ : AP Government | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోతాపురి మామిడి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. మామిడి విక్రయాలపై గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొన్న 40,795 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.185.02 కోట్లను ప్రభుత్వం (Andhra Pradesh Government) జమ చేసింది.
ఈ విషయాన్ని ఉద్యానశాఖ డైరెక్టర్ శ్రీనివాసులు ధృవీకరించారు. జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు రైతులకు చెల్లింపులు పూర్తిచేశామని తెలిపారు. ఈ ఏడాది మామిడి సీజన్‌లో తోతాపురి రైతులు తక్కువ ధరల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
AP Government | మరో శుభవార్త..
ఈ నేపథ్యంలో ప్రభుత్వం టన్నుకు రూ.4 వేల పెట్టుబడి సాయం ప్రకటించింది. రైతులు (Farmers) కొంత కాలంగా ఈ పెండింగ్ డబ్బుల కోసం ఎదురు చూస్తుండగా, ఇప్పుడు ఆ మొత్తాలు జమ కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాల్లో కూడా రైతులకు నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. మామిడి ధరలు (Mango Rates) పడిపోవడంతో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.260 కోట్లు కేటాయించి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (Market Intervention Scheme) కింద కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం ఈ ప్రతిపాదనలకు అనుకూలంగా స్పందించి, రూ.130 కోట్లు మంజూరు చేస్తూ ఆమోదం తెలిపింది.
ఈ పథకంలో రాష్ట్రం 50%, కేంద్రం 50% వాటా భరిస్తుంది. దీంతో భవిష్యత్తులో కూడా ధరలు పడిపోయినప్పుడు రైతులకు ప్రభుత్వ సహాయం అందే మార్గం సుగమమైంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది. మంగళవారం నాటికి 37,881 మంది రైతుల ఖాతాల్లో రూ.172.84 కోట్లు జమ అయ్యాయి. వీరిలో 31,929 మంది రైతులు చిత్తూరు జిల్లాకు చెందినవారు. సుమారు 20,000 మంది రైతులకు లక్ష రూపాయలకుపైగా సహాయం అందింది. ఇంకా డబ్బులు రానివారు ఆర్‌ఎస్‌కే లేదా మండల స్థాయి ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలని కలెక్టర్లు సూచించారు.
ఇక 2025–26 సీజన్ కోసం MIS కింద ధరల లోపం చెల్లింపు (Price Deficiency Payment – PDP)ను కూడా కేంద్రం ఆమోదించింది. దీని ప్రకారం 1.62 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని కొనుగోలు చేసే అవకాశం లభించింది. క్వింటాల్‌కు రూ.1,490.73 మద్దతు ధరగా నిర్ణయించారు. ఈ నిర్ణయం రైతులకు న్యాయమైన ఆదాయం కల్పించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రం మరియు కేంద్రం కలిసి తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు ఊరటను ఇచ్చే తీపికబురుగా మారింది.