అక్షరటుడే, వెబ్డెస్క్: Andhra Pradesh Budget 2026 | ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశ పెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) శనివారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. రూ.3,32,205.33 కోట్లతో బడ్జెట్ రూపొందించారు.
బడ్జెట్ ప్రసంగంలో భాగంగా పయ్యావుల మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్లో (Jammu and Kashmir) పర్యాటకుల్ని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాద మూకలకు ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత ప్రభుత్వం గట్టి జవాబు ఇచ్చిందన్నారు. ప్రధాని నాయకత్వంలో భారత్ శక్తివంతమైన దేశంగా ఎదిగిందని పేర్కొన్నారు. అనంతరం ఆయన బడ్జెట్ లెక్కలు వివరించారు. మొత్తం బడ్జెట్ రూ.3,32,205 కోట్లు కాగా.. ఆర్థిక లోటు రూ. 75,868.09 కోట్లు, రెవెన్యూ లోటు రూ.22,002.50 కోట్లు అని తెలిపారు. మూలధన వ్యయం రూ. 53,915 కోట్లు, కేంద్ర పన్నుల వాటా రూ. 64,362 కోట్లు, పన్నుయేతర ఆదాయం రూ.11,473 కోట్లు, పన్ను ఆదాయం రూ.1,25,845 కోట్లు వస్తుందని అంచనా వేశారు.
Andhra Pradesh Budget 2026 | ఆర్థిక జోన్లు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక జోన్లు ఏర్పాటు చేస్తామని మంత్రి పయ్యావుల తెలిపారు. పట్టాణాభివృద్ధి శాఖకు రూ. 14,539 కోట్లు కేటాయించారు. 9 జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతం, 10 జిల్లాలతో విశాఖ ఆర్థిక ప్రాంతం ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ.28 వేల కోట్లు కేటాయింపులు చేశారు. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కి రూ.30 వేల కోట్లు, వీబి జీ రామ్ జీ పథకానికి రూ. 8,365 కోట్లు, ఎన్టీఆర్ వైద్యసేవకి రూ. 4 వేల కోట్లు ఇస్తామన్నారు.
Andhra Pradesh Budget 2026 | పోలీసులకు కొత్త వాహనాలు
స్త్రీ శక్తి పథకానికి (Stree Shakti Scheme) రూ.1,420 కోట్లు, రోడ్లు, పోర్టులు, ఎయిర్పోర్టుల అభివృద్ధికి రూ.13,546 కోట్లు, ఎంఎస్ఎంఈకి రూ. 3,161 కోట్లు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖకు రూ.1,283 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. పోలీస్ శాఖకు 3 వేల కొత్త వాహనాలు, కొత్త ఏపీ పోలీస్ అకాడమీ ఏర్పాటు కోసం 94 ఎకరాలు కేటాయించారు. ఐటీ శాఖకు రూ. 536 కోట్లు, హోం శాఖకు రూ. 9,165 కోట్లు ప్రతిపాదించారు. పాఠశాల విద్యకు రూ.32,308 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ. 23,650కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి రూ.11,745 కోట్లు ప్రతిపాదించారు.