అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Andhra King Taluka Review | ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనికి మంచి విజయం దక్కక దాదాపు ఐదేళ్లు అవుతుంది. పెద్ద డైరెక్టర్లతో చేసిన మూడు సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో మంచి హిట్ కొట్టాలని అనుకున్న రామ్, కేవలం రెండు చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు మహేష్ బాబు (Director Mahesh Babu) పచ్చిగొళ్ళతో కలిసి ఆంధ్ర కింగ్ తాలూకా చేశారు.
కన్నడ స్టార్ ఉపేంద్ర (Upendra) కీలక పాత్ర పోషించటం విడుదలకు ముందు ఆసక్తి పెంచింది. కొత్త హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, మొదటిసారి తెలుగులో సంగీతం అందించిన వివేక్–మెర్విన్, మైత్రీ మూవీ మేకర్స్ వంటి గట్టి టెక్నికల్ టీమ్‌తో వచ్చిన ఈ చిత్రం చివరకు థియేటర్లలోకి వచ్చింది. మరి రామ్ (Hero Ram Pothineni) హిట్ కొట్టాడా? దర్శకుడు తన మూడో ప్రయత్నంలోనూ ఆకట్టుకున్నాడా? చూద్దాం.
Andhra King Taluka Review | కథ ఏంటంటే?
గోదావరి జిల్లాలోని చిన్న ఊరు గోదపల్లి లంక. అక్కడే ఉండే సాగర్ (రామ్ పోతినేని)కి ‘ఆంధ్ర కింగ్’ సూర్య (ఉపేంద్ర) అంటే ప్రాణం. మహాలక్ష్మి (భాగ్యశ్రీ బోర్సే)ని చూసిన మొదటి క్షణంలోనే ప్రేమలో పడతాడు. కానీ ఆమె తండ్రి (మురళీ శర్మ) సాగర్ స్థాయి, నేపథ్యాన్ని చూసి చులకనగా మాట్లాడుతాడు. దాంతో సాగర్, తన గ్రామంలోనే పెద్ద థియేటర్ కట్టించి తన విలువను నిరూపిస్తానని ఛాలెంజ్ చేస్తాడు.
అయితే, అనూహ్యంగా సాగర్ తనే కట్టించిన థియేటర్ని అమ్మేసి ఆ డబ్బంతా తన అభిమాన హీరో సూర్యకు పంపించేస్తాడు. ఇదే సమయంలో సాగర్ జీవితంలో ఊహించని విధంగా అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే తన అభిమాన హీరో సూర్యకుమార్‌ని కలుసుకోవాలని సాగర్ బయలుదేరడానికి కారణం ఏంటి ? సూర్య శతచిత్రం సాగర్ ప్రేమకథతో ఎలా ముడిపడింది? సాగర్, సూర్య ఇద్దరూ కలిశారా? చివరికి మహాలక్ష్మితో ప్రేమ సక్సెస్ అయిందా?… ఇవన్నీ క్లైమాక్స్‌లో తెలుస్తాయి.
Andhra King Taluka Review | నటీనటుల పర్ఫార్మెన్స్:
ముందుగా మనం రామ్ పోతినేని గురించి మాట్లాడుకోవాలి. రామ్ ఈ సినిమా కోసం పూర్తిగా తనను తాను మార్చుకున్నాడని చెప్పాలి. గత కొన్నేళ్లుగా కనిపించిన ఓవర్-ది-టాప్ ఫైట్లు, డైలాగులు ఎక్కడా కనిపించవు. సాగర్ పాత్రలో జీవించాడు. నేచురల్‌గా, ఇన్నోసెంట్‌గా నటించాడు. ఇక సూర్య పాత్రలో స్క్రీన్ టైమ్ తక్కువైనా, తన స్టైల్‌కు తగ్గట్టే సత్తా చూపించాడు ఉపేంద్ర. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో అద్భుతంగా చేశారు. ఇక భాగ్యశ్రీ బోర్సే (Heroine Bhagyashree Borse) లుక్స్, పెర్ఫార్మన్స్ పరంగా మంచి ఇంప్రెషన్ ఇచ్చింది. మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. రావు రమేష్ ,మురళీ శర్మ..ఈ ఇద్దరు నటులు సినిమా స్థాయిని మరో రేంజ్ ఎక్కించారు. రావు రమేష్ ఆలయ సీన్ అద్భుతం. మురళీ శర్మ ప్రీ ఇంటర్వెల్ సీన్ టాప్ క్లాస్. రాహుల్ రామకృష్ణ, సత్య కామెడీతో పాటు ఎమోషనల్ సీన్లలోనూ బాగా చేశారు. రాజీవ్ కనకాల, తులసి, సింధు టోలాని పాత్రలు చిన్నవైనా, కథకు బలం ఇచ్చాయి.
Andhra King Taluka Review | టెక్నికల్ డిపార్ట్మెంట్ :
వివేక్–మెర్విన్ అందించిన రెండు మెలోడీలు చాలా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సిద్ధార్థ నూని & జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రఫీ అద్భుతం. గోదావరి అందాలను చాలా బాగా చూపించారు. రెండో భాగంలో సైక్లోన్ ఎపిసోడ్ అద్భుతంగా తీశారు. ఇక ఎడిటింగ్ కూడా బాగా కుదిరింది. రెండో భాగంలో కట్టుదిట్టంగా ఉంది. అయితే ఫస్ట్ హాఫ్‌లో 10–15 నిమిషాలు మరింత ట్రిమ్ చేస్తే బాగుండేది. వీఎఫ్ఎక్స్ సీన్స్ కొన్ని చోట్ల తేలిపోయాయి. జెయింట్ వీల్ సీన్లో విజువల్స్ అంత బాలేదు. ఇది మైనస్. మైత్రీ మూవీ మేకర్స్ మరోసారి తమ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఆకట్టుకున్నారు.
నటీనటులు : రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, రాజీవ్ కనకాల, తులసి, సింధు టోలాని, సత్య, విటీవీ గణేష్ తదితరులు
దర్శకుడు : మహేష్ బాబు పచ్చిగొళ్ళ
నిర్మాతలు : నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్
బ్యానర్ : మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం : వివేక్–మెర్విన్
ప్లస్ పాయింట్స్
రామ్ పోతినేని నేచురల్ యాక్టింగ్
రాయబారంలా నిలిచే రావు రమేష్ ఆలయ సీన్
ఎమోషనల్ ప్రీ-ఇంటర్వెల్
అద్భుతమైన డైలాగులు
రెండో భాగం స్క్రీన్‌ప్లే
మంచి సంగీతం
Andhra King Taluka Review | మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగడం
కొద్దిపాటి సన్నివేశాల్లో బలహీనమైన VFX
విశ్లేషణ
ఆంధ్ర కింగ్ తాలూకా కేవలం హీరోయిన్ కోసం హీరో చేసే పనులు, హీరో–ఫ్యాన్ సంబంధం గురించి మాత్రమే కాదు. ఒక వ్యక్తి తన అభిమానానికి, ప్రేమకు, గ్రామానికి, తనకు ప్రేరణనిచ్చిన స్టార్‌కి ఎంత దూరం వెళ్తాడనే అందమైన కథ ఇది. డైరెక్టర్ మహేష్ బాబు పచ్చిగొళ్ళ రచనలో నిజాయితీ కనిపిస్తుంది. సాగర్ బ్యాక్‌స్టోరీ అద్భుతంగా రాసుకున్నాడు . ఫ్యాన్–హీరో సంబంధం చూపించిన తీరు బాగా అనిపిస్తుంది. క్లైమాక్స్ అట్ట్రాక్టివ్‌గా, హృదయాన్ని హత్తుకునేలా ఉంది.
డైలాగులు ఈ సినిమాలో ప్రాణం. కనీసం పదిహేను డైలాగులు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. అవి ప్రతి ఒక్కరు ఆలోచించే విధంగా ఉంటాయి. మొత్తానికి మొదటి భాగంలో కాస్త నెమ్మదిగా కథ వెళుతుందన్న ఫీలింగ్ తప్ప, ఈ సినిమా హృదయానికి హత్తుకునే కథతో ముందుకు సాగుతుంది. ఆంధ్ర కింగ్ తాలూకా హృదయాన్ని తాకే ప్రేమ–ఫ్యాన్ కథను నిజాయితీగా చెప్పిన మంచి సినిమా. ఫీల్-గుడ్ సినిమాలు, ఎమోషన్స్ నచ్చేవారు మస్ట్ వాచ్. రామ్ పోతినేని ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తుండగా, ఎట్టకేలకి ఈ మూవీతో దక్కింది.
రేటింగ్: 3.25/5
