అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Anaswara Rajan | ఈ రోజుల్లో సినీ ఇండస్ట్రీలో టాలెంట్‌తో పాటు మాటకారితనం కూడా చాలా కీలకం. ముఖ్యంగా ఇతర భాషల నుంచి టాలీవుడ్లో (Tollywood) అడుగుపెడుతున్న హీరోయిన్లకు ఇది మరింత అవసరం. ఈ విషయంలో కొత్తగా టాలీవుడ్‌కు పరిచయమైన కేరళ కుట్టి అనస్వర రాజన్ (Anaswara Rajan) తన తెలివితేటలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
చిన్న వయసులోనే తన మాటలతో, ఇంటర్వ్యూలతో హాట్ టాపిక్‌గా మారుతోంది. ‘చాంపియన్స్’ సినిమాతో (Champions Movie) తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనస్వర రాజన్ తాజాగా ఇచ్చిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. తనకు అల్లు అర్జున్ (Allu Arjun) ఒక తెలుగు స్టార్ హీరో అని ముందుగా తెలియదని, ఆయన సినిమాలు మలయాళంలోకి డబ్ అయి రావడంతో స్ట్రెయిట్ మలయాళ హీరో అనుకున్నానని చెప్పింది.
Anaswara Rajan | మాటలతో కోటలు..
అలాగే ‘మగధీర’ సినిమా చూసినప్పుడు అది తెలుగు సినిమా అని కూడా తెలియదని అనస్వర చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.ఇలాంటి స్టేట్మెంట్లు ఆమె అమాయకత్వమా? లేక చాకచక్యమా? అన్న చర్చ నడుస్తోంది. అయితే చాలా మంది మాత్రం అనస్వర చాలా తెలివిగా స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోందని కామెంట్ చేస్తున్నారు. ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అన్నట్లుగా, కెరీర్ ఆరంభంలోనే మీడియా హ్యాండ్లింగ్‌లో ఆమె చూపిస్తున్న చురుకుదనం ప్రశంసలు పొందుతోంది. ఇప్పటికే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా అనస్వర అందచందాలు, ప్రతిభను మెచ్చుకుంటూ భవిష్యత్తులో పెద్ద అవకాశాలు వస్తాయని చెప్పడం విశేషం. దీంతో ఈ అమ్మడిని తక్కువ అంచనా వేయలేమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
నేటి రోజుల్లో ప్రతిభతో పాటు తనను తాను ప్రమోట్ (Promote) చేసుకునే తెలివి, చొరవ, సందర్భోచితంగా మాట్లాడే నైపుణ్యం అవసరమని, అవన్నీ అనస్వర రాజన్లో ఉన్నాయని అంటున్నారు. డిసెంబర్ 25న విడుదల కానున్న ‘చాంపియన్స్’ సినిమా కోసం అనస్వర ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. ఇదే సమయంలో ఆమె రెండో తెలుగు సినిమాను కూడా ఇప్పటికే ఫిక్స్ చేసుకుంది. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్ దర్శకుడు మహేష్ ఉప్పల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్కు అనస్వర అధికారికంగా సంతకం చేసింది. ఈ చిత్రానికి తమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా, రాజా మహాదేవన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపడుతున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ టీజర్‌కు మంచి స్పందన లభించింది.